దేవాలయాల ధ్వంసం కేసుల్లో అసలు నిందితులను పట్టుకోకుండా బీజేపీపై నెట్టడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరశింహారావు విమర్శించారు. విశాఖలో సుదీర్ఘంగా సాగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఆనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలు ఇతర పార్టీలకు అంటగడదామన్న తాపత్రయం తప్పిస్తే, అసలైన దోషులను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి లేదని జీవీఎల్ విమర్శించారు.బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన నలుగురిపై దేవాలయాల ధ్వంసం కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దోషులను పట్టుకోకుండా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారనే నెపంతో బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు.
రామతీర్థంలో రాముని విగ్రహ ధ్వంసంతో పాటు ఏపీలో జరిగిన దేవాలయాల ధ్వంసం చేసిన అసలైన విధ్వంసకారులను పట్టుకోవాలని జీవీఎల్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. అసలైన దోషులను పట్టుకోకుంటే బీజేపీ హిందూ ధర్మపరిరక్షణకు పూనుకుంటుందని జీవీఎల్ హెచ్చరించారు. విశాఖలో ఇవాళ జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన వ్యూహాలను చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై కూడా బీజేపీ నేతలు సుదీర్థంగా చర్చించినట్టు తెలుస్తోంది.











