ఓ పక్క సెన్సేషనల్ రికార్డ్.. ఇంకో పక్క ప్రభుత్వ తాఖీదు.. కేజీఎఫ్2 చిత్ర బృందం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి తయారైంది. రికార్డులు చూసి ఆనంద పడాలో, అందిన నోటీసులు చూసి బెంబేలు పడాలో అర్థం కావడం లేదు. రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ 2 టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సాధించిన రికార్డు మామాలుగా లేదు. ఇంత వరకు మన భారతీయ సినిమాలో ఏ హీరో టీజర్ కూడా ఇలాంటి రికార్డు సాధించలేదు. వారం క్రితం విడుదలైన ఈ టీజర్ ఇప్పటికి 155 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 టీజర్ ఉంటుంది. ఈ టీజర్ కు 118 మిలియన్ వ్యూస్ లభించాయి.
తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ టీజర్ 59 మిలియన్ వ్యూస్ సాధించి ఓ రికార్డు సాధించింది. కేజీఎఫ్ 2 టీజర్ కి ఇంత హైప్ రావడానికి కారణం కేజీఎఫ్ మొదటి భాగంతో వచ్చిన క్రేజ్ ఒకటి అయితే, ఇంకో కారణం ఇందులో హీరో ఎలివేషన్. ఎవరి నోట విన్నా ఈ ఎలివేషన్ గురించే మాట్లాడారు. ఆ హీరో ఎలివేషన్ సీన్ మీదే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దృష్టి పెట్టింది. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే టీజర్ కట్ చేసేటప్పుడు ‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అన్న హెచ్చరికను దర్శకుడు ప్రశాంత్ నీల్ చేయలేదు.
ఈ చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ టీజర్ పై అభ్యంతరం చెబుతూ కర్ణాటక ఆరోగ్య శాఖ, యాంటా టొబాకో సెల్ తాజాగా యష్ కు నోటీసులు జారీ చేసింది. ఈ టీజర్ లో మెషీన్ గన్ బారెల్ నుంచి హీరో సిగార్ వెలిగించుకోవడం లాంటి సన్నివేశాలు తొలగించాలని హెచ్చరిస్తూ నోటీసు జారీ చేసింది. పొగాకు నియంత్రణ చట్టం సెక్షన్ 5 నిబంధనలకు అనుగుణంగా తాము ఈ నోటీసు జారీ చేసినట్టు పేర్కొంది. అంతేకాదు ఈ యాంటీ టొబాకా సెల్ ఇంకా వివరణ ఇచ్చింది. హీరో యష్ కు ఉన్న అభిమానుల్లో పొగతాగే వారు ఎక్కువ.
ఈ టీజర్ లోని పొగతాగే సన్నివేశం వల్ల యువత తప్పుదోవ పడతారని, క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని హెచ్చిరించింది. వెంటనే ఈ టీజర్ నుంచి ఈ సన్నివేశాన్ని తొలిగించాలని పేర్కొంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ, నిర్మాత విజయ్ కిర్గాందర్ గానీ ఈ సన్నివేశం తొలగింపు చర్యలేవీ చేపట్టడం లేదు. ఇంకా అదే టీజర్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో వీరు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందరూ ఈ టీజర్ లోని ఈ సన్నివేశానికే ఫిదా అయిపోయారు. అలాంటప్పుడు దిద్దుబాటు చర్యలు ఎలా చేపడతారో ఎవరికీ అర్థం కావడం లేదు.











