( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి చెప్పడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. వాస్తవానికి అరకు పార్లమెంట్ ఒక జిల్లాగా ఏర్పాటు కావాలి. కానీ అరకు భౌగోళిక పరిస్థితులను బట్టి దానిని మూడు జిల్లాలుగా చేస్తేనే ప్రయోజనం ఉంటుందని, రెండు జిల్లాలుగా చేయడం ప్రజలకు అన్యాయం చేయడమేనని గిరిజన సంఘాల వారు, స్థానికులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు జిల్లాల్లో విస్తరించిన అరకు పార్లమెంట్..
విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రంపచోడవరం, విజయనగరం జిల్లాకు చెందిన పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీతంపేట మండలాలు, గ్రామాలు, పంచాయతీలు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. వీటిని ఒక జిల్లాగా ప్రకటించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అలాగని రెండు జిల్లాల చేసినా ఒక ప్రాంతం వారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. రంపచోడవరం పరిసర ప్రాంతాలను అరుకులో కలపడం వల్ల అరకు హెడ్ క్వార్టర్‌కు రావాలంటే 300 కిలోమీటర్లకు పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం లేక పోవడమే అందుకు కారణం. రంపచోడవరంలోనే అడ్డతీగల, మారేడుమిల్లి , పోలవరం ముంపు గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ఇక్కడ అనారోగ్యం పాలైన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. రేపు అరకులో కలిపితే అదే హెడ్ క్వార్టర్ అవుతుంది కనుక అక్కడికే రిఫర్ చేస్తారు. అలా చేయడం వల్ల ప్రస్తుతమున్న రవాణా సౌకర్యాలతో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే దీనిని ప్రత్యేక జిల్లాగా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అదే విధంగా విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో ఉంది. గుమ్మ లక్ష్మీపురం, నీలకంఠాపురం, కూనేరు మండలాలకు అరకు హెడ్ క్వార్టర్‌గా పెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న మందస లాంటి గ్రామాలకు అరకు ఎంత దూరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని మంత్రి కృష్ణ మోహన్ దాస్ బహిరంగంగానే ప్రస్తావించారు. సీతంపేట ఐటీడీఏ పరిధి మొత్తాన్ని శ్రీకాకుళంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
మరి వీటన్నింటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? . పరిపాలన, ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలకు విలువ లేనప్పుడు ప్రయోజనం ఏముందని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా చేస్తే ఉద్యమాలు ఉద్భవిస్తాయని హెచ్చరిస్తున్నాయి.











