సింహాచల దేవస్థానం అధికారులను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక్కడి పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు నియామకంతో ఒక కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్టైంది. ఈ క్రమంలో- తనను దేవస్థానం విధుల నుంచి తప్పించండి… అంటూ ఈవో డి భ్రమరాంబ ఉన్నత అధికారులకు లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అది ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పి.
దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించాలి అంటే గతంలో భూవివాదాలు తలనొప్పిగా ఉండేవి. తరువాత కాలంలో భూవివాదాలు కొంత మేరకు సద్దుమణిగినా ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. గత ఈవో హయాంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. అలాగే దేవస్థానం యూనియన్ కోసం నిర్మించిన అనధికార భవనం కూడా వివాదాస్పదమైంది. వీటికి బాధ్యులను చేస్తూ కొంతమంది పై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అందులో భాగంగా గత ఈ ఓ వెంకటేశ్వరరావును బదిలీ చేయగా, మరికొంతమంది సిబ్బందిపై కూడా వేటు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈవో గా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ అనుచరవర్గం ఆ జాబితాలో ఉండడంతో… వారిపై వేటు వేయలేక.. వెల్లువెత్తుతున్న విమర్శలు తట్టుకోలేక సతమతమవుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా గత కొంత కాలంగా దేవస్థాన సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక సిబ్బందిని, కాంట్రాక్టు సిబ్బంది ని తొలగించి ఆర్థికభారం తగ్గించుకోవాలని భావించిన ఈ ఓ నిర్ణయానికి వ్యతిరేకంగా నే వ్యవహరించాల్సి వచ్చింది. తొలగించిన 183 మంది సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ మంత్రికి సీఎం జగన్ ద్వారా చెప్పించడం తో తిరిగి విధుల్లోకి తీసుకోక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఈ ఓ కు తలనొప్పిగా మారాయి.
గత మూడు నెలలుగా ఓ అనధికార వ్యక్తి సింహగిరి కాటేజీలో బస చేయడం దేవస్థానం అధికారులపై పెత్తనం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు అదే వ్యక్తిని ఓఎస్డీగా నియమించడంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ వరుస పరిణామాలన్నింటినీ ఎదుర్కోవడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో తనను దేవస్థానం బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది . అదే గనుక జరిగితే సింహాచలం దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు వార్తల్లోకి ఎక్కడం ఖాయం.











