కరోనా సమయంలో ఓ సినిమాని తీయడమంటే ఎన్ని గుండెలు కావాలి. పైగా కేవలం ఐఫోన్ తో షూటింగ్ చేయడం. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? దీన్ని ఎలా తీశారు? నటుడు ఫాహద్ ఫాజిల్ ఇందులో ఎలా నటించాడు? లాంటి ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. కప్పేలా ఫేమ్ రోషన్ మాధ్యూ , సూపర్ డీలక్స్, ట్రాన్స్ లాంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఫాహీద్ ఫాజిల్ కాంబినేషన్‌లో సీ యూ సూన్ తెరకెక్కింది. ఓనం సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 1న ఈ సినిమా విడుదలైంది. విభిన్నమైన టేకింగ్, సాంకేతిక విలువలు, ఫీల్‌గుడ్ కంటెంట్ వెరసి ‘సీ యూ సూన్’.
కథేంటి?: టిండర్ అనే డేటింగ్ యాప్ తో ముడిపడిన కథ ఇది. దుబాయ్‌లో ఫైనాన్సియల్ సెక్టార్‌లో పనిచేసే జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ)కి ఈ యాప్ ద్వారా అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్) పరిచయమవుతుంది. గూగూల్ హ్యాంగ్ అవుట్, స్కైప్ లాంటి ఛాటింగ్ తో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అనుతో తనకు జరుగుతున్న డేటింగ్ విషయాన్ని తన కజిన్, సైబర్ సెక్యూరిటీ ట్రాక్ చేసే కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్) చెబుతాడు జిమ్మి. అతని సహాయం కూడా కోరతాడు. తాను కష్టాల్లో ఉన్నానని, ఇబ్బందులు పడుతున్నానని అను సెబాస్టియన్ అడగడంతో ఆమెను తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు.
ఆ తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొంటారు. చట్టవ్యతిరేకంగా సహజీవనం చేసినందుకు దుబాయ్ పోలీసులు జిమ్మిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆమెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అను వల్ల జిమ్మికి ఎదురైన సమస్యలేంటి? దుబాయ్ పోలీసుల నుంచి వారు ఎలా బయటపడ్డారు. జిమ్మికి కెవిన్ ఎలా సహకరించాడు? అను సెబాస్టియన్ గతం ఏమిటి? ఆమె సమస్యను టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ద్వారా ఎలా కెవిన్ తెలుసుకొన్నాడు? లాంటి అనేక విషయాలు ఈ కథలో ఇమిడి ఉంటాయి.
ఎలా తీశారు? : నేటి సాంకేతిక విషయాలను ఇందులో చక్కగా ఆవిష్కరించారు. గల్ప్ లో ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకు ఎరవేయడం, ఆతర్వాత వారిని వేశ్యావృత్తిలోకి దించడం సర్వసాధారంగా జరుగుతోంది. కేరళలలో ఉన్న ఈ తరహా సమస్యకు టెక్నాలజీని జోడించి తీసే ప్రయత్నం చేశారు. ఇలాంటి కథలకు న్యాయం చేయడంలో కేరళీయులకు ఉన్న నేర్పు చాలా ప్రత్యేకమైనది. మొబైల్, కంపూటర్ల మధ్య జరిగే చాటింగ్ ద్వారా పూర్తిగా సినిమా నడిపారు. ఈ సినిమాలో ఇదే హైలెట్. ఇద్దరు ప్రేమికులు జైల్లో ఎందుకు పడ్డారనే అంశానికి సస్పెన్స్, మిస్టరీ, థ్రిలర్ లను జోడించి కథను రక్తికట్టించారు. దర్శకుడు మహేష్ నారాయణ్ టేకింగ్ అద్భుతం. ఉద్యోగాల ఎరతో యువతీ యువకులు ఎలాంటి సమస్యల్లో కూరుకుపోతున్నారనే కథను హృద్యంగా ఆవిష్కరించడం మహేష్ నారాయణ్ ప్రతిభకు దర్పణం.
ఎలా చేశారు?: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ సహజంగానే తమ నటనతో మెప్పించారు. భావోద్వేగాలను చక్కగా పండించారు. అను సెబాస్టియన్ గా దర్శనా రాజేంద్రన్ పాత్రలో ఒదిగిపోయింది. డైలాగ్స్ తక్కువగా, ఎమోషన్స్ ఎక్కువగా పలికించే స్కోప్ ఉన్న పాత్ర ఇది. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.
నటీనటులు: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శనా రాజేంద్రన్, సైజు కురుప్, మాలా పార్వతి
రచన, దర్శకత్శం: మహేష్ నారాయణ్
నిర్మాతలు: ఫాహద్ పాజిల్, నజ్రియా నాజిం
మ్యూజిక్: గోపి సుందర్
సినిమాటోగ్రఫి: సబిన్ ఉలికాందీ, వర్చువల్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్
బ్యానర్: ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఒక్క మాటలో: మరో మళయాళ మంత్రజాలం.
రేటింగ్ : 3.5/5
– హేమసుందర్ పామర్తి