ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. ప్రతి రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 31 వేలు దాటింది. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులు మాత్రమే గాక ప్రముఖులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరు హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. పెద్దిరెడ్డి పరిస్థితి మామూలుగానే ఉందని తెలిపిన వైద్యులు షరీఫ్ పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రముఖులు కరోనా చికిత్సకు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లోనే ఎందుకు చేరుతున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోనే కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సొంత పార్టీ నాయకులే ప్రక్క రాష్ట్రాల వైద్యం కోసం ఎందుకు చూస్తారు? వైసీపీలో కీలక నాయకుడు విజయసాయి రెడ్డి కరోనా బారిన పడటంతో ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి లాంటి ప్రముఖులు తమకు కరోనా సోకడం ఆలస్యం హైదరాబాదు అపోలో లో చేరారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కూడా కార్పొరేట్ హాస్పిటల్ లోనే చేరడంతో విమర్శలు వినబడుతున్నాయి.
ప్రజలకు భరోసానిస్తూ ఏపీలోనే చికిత్స తీసుకోవలసిన నాయకులు హైదరాబాద్ కు రావడంమేమంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బ్యూరోక్రాట్స్ కూడా వైద్యం కోసం ప్రక్క రాష్ట్రాల వైపే చూస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి నాని రాష్ట్రంలోనే వైద్యం చేయించుకోవాలని అన్నీ ఏర్పాట్లు చేశామని పిలుపు నిచ్చారు. కానీ నాయకులు అప్పనమ్మకమో లేక అపోలో మీద నమ్మకమో అనారోగ్యం బారిన పడగానే చలో హైదరాబాద్ అంటూ వచ్చేస్తున్నారు. కష్టకాలంలో నాయకులు చేసే ఇలాంటి పనులు ప్రజల నైతిక విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. ఇప్పటికయినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుకుందాం!











