జగన్ మోహన్ రెడ్డి హాయాంలో ఎక్కువ కాలం టీటీడీ ఛైర్మన్ పదవి వెలగబెట్టిన వైవీ సుబ్బారెడ్డి వ్యవహార శైలి ప్రస్తుతం అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో అన్ని రకాల విచారణలు జరగాలని అన్ని వర్గాల నుంచి ప్రధానమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ లడ్డూ తయారీలో వాడే స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడారని, పైగా ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలు వాడారనే సంచలన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి అయ్యారు.
ఆయన హాయాంలోనే అప్పటి వరకూ టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తున్న కర్ణాటకకు చెందిన నందినీ డెయిరీని తప్పించి మరో సంస్థకు ఆ కాంట్రాక్టును ఇప్పించుకున్నారు. వారి నుంచి కిలో రూ.319కే నెయ్యిని కొనుగోలు చేసేవారు. నందిని సంస్థ నుంచి కమిషన్లు దక్కడం లేదనే ఉద్దేశంతోనే మరో సంస్థను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డిపై విచారణకు ఆదేశించింది.
దీంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను రద్దు చేయాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరపబోతోంది. తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కోరారని.. తనపై ఆరోపణలేంటి? అందుకు సంబంధించిన ఫైళ్లు ఇవ్వండని కోరితే స్పందించలేదని అన్నారు. తాను వివరణ ఇవ్వకుండానే విచారణ పూర్తిచేశారని వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. అసలు టీటీడీ వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని వైవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు.
టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని.. అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. అయితే, వైవీ సుబ్బారెడ్డి ఇంతలా జంకుతూ తనపై విచారణను ఆపాలని కోర్టుకు వెళ్లడం.. అనుమానాలను మరింత పెంచుతోంది. ఏ తప్పు చేయకుండా ఉండి ఉంటే.. ధైర్యంగా ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.