తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డు మాంసపు నూనె కలిసి, అది పూర్తిగా అపవిత్రం అయిపోయిందన్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ భారీ అక్రమం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు మహాప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదంపై కార్మిక శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే తీవ్రంగా స్పందించారు.
తిరుమలకు చెందిన కాలేజీల్లో పద్మావతీ దేవి, శ్రీనివాసుడి ఫొటోలను తొలగించాలని, హిందూయేతర గుర్తులను సప్తగిరులపై ఏర్పాటు చేయాలని జగన్ అండ్ కో చూసిందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులు కాని వారిని బోర్డ్ ఛైర్మన్‌గా వైసీపీ నియమించిందని అన్నారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపిందని.. వెంకటేశ్వరస్వామీ.. మా చుట్టూ జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్మల్ని క్షమించు అని ఘాటుగా ఆమె ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
మరో కేంద్ర మంత్రి స్పందిస్తూ.. తిరుమల లడ్డూలో కల్తీ ఆరోపణలపై దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైందని.. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని శిక్షించాలని ఆయన ఓ మీడియాతో అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో ఫిష్ ఆయిల్‌తోపాటు గొడ్డు, పందికొవ్వు నుంచి తీసిన నూనెలు కలిపినట్లు తేలిందని టీడీపీ ఆధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే.
గుజరాత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ల్యాబొరేటరీ ఎన్‌డీడీబీ కాఫ్ ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. ఇది కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం కాదా? అని ప్రశ్నించారు. గోవిందుడితో పెట్టుకున్నవారు సర్వనాశనమైపోతారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి వాడారనేది నిజమే అనని.. తిరుపతిలో టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ కూడా చెప్పారు. నెయ్యి టెండర్ అప్పజెప్పిన ఆల్ఫా సంస్థ రకరకాల కెమికల్స్ ద్వారా తయారుచేసిన నెయ్యిని సరఫరా చేసిందని తెలిపారు.











