డ్రగ్స్ వ్యవహారం ఇటు ఏపీతో పాటు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగితే.. మహారాష్ట్రలో మాత్రం బాలీవుడ్ ప్రముఖ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ యావత్తు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు.. ఏపీ పోలీసులకు ఏమాత్రం తీసిపోలేదన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ దక్కేదాకా మహారాష్ట్ర పోలీసుల అత్యుత్సాహం బయటపడలేదు గానీ.. ఎప్పుడైతే ఆర్యన్‌కు బెయిల్ దక్కిందో అప్పుడే మరాఠా ఖాకీలు.. ఏపీ పోలీసులకు ఏమాత్రం తీసిపోని రీతిలో అత్యుత్సాహం ప్రదర్శించారన్న విషయం బట్టబయలైపోయింది. కాకలు తీరిన న్యాయవాదిగా పేరున్న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఆర్యన్ తరఫున వాదనలు వినిపించి అతడికి బెయిల్ దక్కేలా చేశారు. రోహత్గీ వాదనలు విన్న బొంబాయి హైకోర్టు ఆర్యన్‌కు ఇట్టే బెయిల్ మంజూరు చేసేసింది.
ఏ కారణాలతో ఆర్యన్ అరెస్ట్?
ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కు ముంబై పోలీసులు పెద్దగా ఆధారాలే సేకరించకుండానే రంగంలోకి దిగిపోయారు. ముంబైలో ఓ క్రూయీజ్‌లో పలు రంగాలకు చెందిన ప్రముఖుల పిల్లలు పార్టీ చేసుకున్నారని, అందులో డ్రగ్స్ వినియోగించారన్న ఫిర్యాదులు అందడం. ఆ పార్టీలో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా పాలుపంచుకున్నాడన్న సమాచారం అందగానే.. మరాఠా పోలీసులు మరింత హడావిడి చూపారు. వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన మరాఠా పోలీసులు ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి మొబైల్‌ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్‌కు సంబంధించి పలువురితో అతడు చేసిన చాటింగ్ బయటపడిందట. ఇంకేముంది ఆర్యన్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అయినా ఆర్యన్‌కు డ్రగ్స్ టెస్టులు చేయించారా? అంటే.. అదీ లేదు. ఇక అతడి మొబైల్‌లో దొరికిన డ్రగ్స్ చాట్స్ ఎప్పటివో కూడా పోలీసులు పరిశీలించలేదట. తన కుమారుడికి అప్పటికే రెండు పర్యాయాలు బెయిల్ తిరస్కరణకు గురైందన్న వాదనతో ఈ దఫా షారూఖ్.. ముకుల్ రోహత్గీని ఆశ్రయించారు. రోహత్గీ ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును, పోలీసులు సేకరించిన సాక్ష్యాలను పరిశీలించారు. నేరుగా హైకోర్టులోనే పిటిషన్ వేసి.. పోలీసులు చేసిన తప్పులను ఎత్తి చూపారట. పోలీసుల తప్పులన్నీ కళ్లకు కట్టినట్టుగా కనిపించడంతో బొంబాయి హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రోహత్గీ చేసిన వాదనలేంటి?
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కు సంబంధించి చాటింగ్ అంతా అతడు ఎప్పుడో అమెరికాలో ఉన్నప్పుడు చేసినవట. అమెరికాలో డ్రగ్స్ తీసుకోవడం చట్ట విరుద్ధమేమీ కాదు కదా. అదే విషయాన్ని రోహత్గీ కోర్టు ముందుంచారట. ఇక ఆర్యన్ డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారించేందుకు పోలీసులు ఏవైనా పరీక్షలు చేయించారా? అని రోహత్గీ అడగ్గా.. అలాంటిదేమీ లేదని కోర్టు ముందే పోలీసులు ఒప్పుకున్నారట. మరి డ్రగ్స్ పరీక్షలు చేయకుండానే ఆర్యన్‌ను రోజుల తరబడి ఎలా నిర్బంధిస్తారని కూడా రోహత్గీ నిలదీశారట. ఇక ఆర్యన్‌తో పాటు అరెస్ట్ అయిన ఆర్బన్ అనే యువకుడి బూటులో మత్తు పదార్థాలు దొరికాయని పోలీసులు తెలిపారట. మరి ఆర్భజ్ బూటులో డ్రగ్స్ దొరికితే.. ఆర్యన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని రోహత్గీ పోలీసులను ప్రశ్నించారట. ఈ ప్రశ్నకు పోలీసుల నుంచి మౌనమే సమాధానమైందట. ఇలా వరుసబెట్టి ఆర్యన్ అరెస్ట్‌లో పోలీసులు చేసిన తప్పులను రోహత్గీ బయటపెడితే.. హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిందట. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే.. అప్పుడెప్పుడో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజునో, గత వారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌నో అరెస్ట్ చేసిన సందర్భంగా ఏపీ పోలీసులు చూపిన అత్యుత్సాహం గుర్తుకు వస్తోంది కదా.