దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ముద్దుల తనయ వైఎస్ షర్మిల టార్గెట్ అయినంతగా వేరెవరూ కాలేదనే చెప్పాలి. వివాహిత అయిన ఆమెకు ఇతరులతో సంబంధాలు అంటకడుతూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టులు తెగ వైరల్ అయిపోయాయి. వీటిపై స్వయంగా షర్మిలే మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేసేదాకా పరిస్థితి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదంతా గతం అనుకుంటే.. జగన్ నిరాదరణతో ఏపీని వదిలేసి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. వైఎస్సార్టీపీ పేరిట కొత్త రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ ఆమె చేస్తున్న కామెంట్లకు జనం నుంచి పెద్దగా స్పందన రాకున్నా.. ఆమె మాత్రం తన వంతు యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు ఆమెపై మరోమారు తీవ్రమైన దాడిని మొదలెట్టేశారు. ఈ దాడిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండానే షర్మిల ఎదురు దాడి మొదలెట్టేశారు.
మంగళవారం మరదలు
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల.. తాను తెలంగాణ కోడలినంటూ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డ నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన షర్మిల.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు అంటూ సాగుతున్నారు. ఈ దీక్షలపై విమర్శలు సంధించే క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలను మంగళవారం మరదలు అంటూ సంబోధించిన ఆయన కలకలమే రేపారు. బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన మంగళవారం మరదలు బయల్దేరిందంటూ షర్మిలనుద్దేశించి కామెంట్ చేశారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి నోట ఈ వ్యాఖ్యలు వినిపించగానే.. షర్మిలను తెలంగాణ జనం ఇలా అనుకుంటున్నారా? అన్న దిశగానూ సరికొత్త విశ్లేషణలు సాగాయి.
షర్మిల రివర్స్ అటాక్..
బుధవారం మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను షర్మిల తిప్పికొట్టే యత్నం చేశారు. మంత్రి వ్యాఖ్యలకేమీ తీసిపోని రీతిలో షర్మిల కూడా ఘాటుగానే స్పందించారు. చందమామను చూసి శునకాలు మొరగడం సాధారణమైన విషయమేనని షర్మిల తనదైన శైలి వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని ఆమె టీఆర్ఎస్ మంత్రులు శునకాల్లా మొరుగుతున్నారని మరింత ఘాటు వ్యాఖ్య చేశారు. ఇలాంటి కుక్కలను తరిమికొట్టడం ఖాయమని, ఆ రోజు మరెంతో దూరంలో లేదని పేర్కొన్నారు. నేరుగా మంత్రితో పాటు టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కేబినెట్ మొత్తాన్ని టార్గెట్ చేసుకుని షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీని ఒకింత అసహనానికి గురి చేసేవేనని చెప్పక తప్పదు. మరి ఈ వివాదం ఇక్కడితోనే ఆగుతుందా? మరింత మేర రచ్చ అవుతుందా? అన్నది వేచి చూడాలి.
Mus Reda ;- ఓవైసీలకు షర్మిల గండి కొడతారా?