తెలుగు చిత్ర పరిశ్రమకు సంబందించిన పలు సమస్యలపై చర్చించేందుకు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన నాగార్జున తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. జగన్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. దాదాపుగా గంట పాటు సాగిన ఈ భేటీలో టాలీవుడ్ సమస్యలపై సుధీర్ఘంగానే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై అటు నాగార్జున గానీ, ఇటు జగన్ కార్యాలయం గానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ సమస్యలపై జగన్‌తో చర్చించేందుకు ఇదివరకు వచ్చిన సినీ ప్రతినిధి బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలియాస్ వెంకటరమణా రెడ్డి మాత్రం నాగార్జున వెంట కనిపించకపోవడం గమనార్హం.
ఇద్దరు నిర్మాతలతో నాగ్
జగన్‌తో భేటీ కోసం విజయవాడ వచ్చిన నాగార్జున తన వెంట ఇద్దరు నిర్మాతలను వెంటబెట్టుకుని వచ్చారు. వీరిలో నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ప్రీతం రెడ్డిలు ఉన్నారు. వీరిద్దరూ సీఎం జగన్, నాగ్‌లతో కలిసి మద్యాహ్న భోజనం చేశారు. జగన్‌తో చర్చల్లోనూ పాలుపంచుకున్నారు. అయితే టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా కొనసాగుతూనే.. జగన్‌తో చర్చల్లో కీలకంగా వ్యవహరించిన దిల్ రాజు మాత్రం ఈ భేటీలో కనిపించని వైనంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో జగన్‌తో చర్చలకు నాగార్జునతో పాటు విక్టరీ వెంకటేశ్ సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ కూడా కనిపించే వారు. అయితే ఈ దఫా నాగార్జునతో ఆయన కూడా కనిపించలేదు.
చిరు సైడైనట్టేనా?
టాలీవుడ్ సమస్యలపై ఏపీ సర్కారుతో చర్చలకు తెర తీసిందే మెగాస్టార్ చిరంజీవి. జగన్ సీఎం కాగానే.. సతీసమేతంగా తాడేపల్లి వచ్చిన చిరుకు జగన్ కూడా రెడ్ కార్పెట్ స్వాగతమే పలికారు. దీంతో సినీ సమస్యలు ఏవున్నా కూడా చిరునే నేతృత్వం వహిస్తారన్న వాదనలు వినిపించాయి. అనుకున్నట్లుగానే సినిమా టికెట్ల రేట్ల పెంపే ప్రధానంగా జరిగిన చర్చల్లో చిరునే కీలకంగా వ్యవహరించారు. అయితే సినీ పరిశ్రమ కోరుకున్నట్లుగా సినిమా టికెట్ల రేట్ల పెంపునకు జగన్ సానుకూలంగా స్పందించకపోగా.. సినిమా టికెట్ల విక్రయాలను ఏపీ ప్రభుత్వమే తన అధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే విధి విధానాలు ఖరారు కాగా.. గురువారం నాటి కేబినెట్ భేటీలో ఈ విధానానికి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఈ దిశగా నిర్ణయం జరిగిపోవడంతోనే ఏపీ సర్కారుతో చర్చల విషయంలో చిరు సైడైపోయినట్టుగా తెలుస్తోంది. సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయాలు ప్రభుత్వ ఆధీనంలోనే జరిగిలే నిర్ణయం తీసుకున్న కేబినెట్ భేటీ ముగియగానే.. జగన్‌తో నాగార్జున భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో అటు చిరు గానీ, ఇటు దిల్ రాజు గానీ కనిపించకపోవడం గమనార్హం.











