ఏపీలో మరో ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగా హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అశోక్ లేల్యాండ్ ఎలక్ట్రికల్, డీజిల్ బస్సులకు సంబంధించిన అత్యాధునిక బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పింది. భారీ పరిశ్రమల కేటగిరిలో విజయవాడ మల్లవల్లి మోడల్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆ ప్లాంట్‌ను మంత్రి లోకేష్ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు.
గత TDP ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్ ఇండస్ర్టియల్ కారిడార్‌లో అశోక్ లేల్యాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ఆ సంస్థ ఎలక్ట్రికల్ బస్ బాడీ బిల్డింగ్ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఐతే ఈ ప్లాంట్‌ను ప్రారంభించే లోపు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం అశోక్ లేల్యాండ్‌కు తగిన సహకారం ఇవ్వలేదు. గడిచిన ఐదేళ్లు వైసీపీ తీరు కారణంగా ఏపీలో పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయాయి. ఉన్నవాళ్లు సైతం గడ్డు కాలం గడిపారు. ఇక కొవిడ్ అనంతర పరిస్థితులు కూడా ప్లాంట్ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయి.
ఐతే కూటమి ప్రభు త్వం వచ్చాక మళ్లీ పనులు వేగంగా సాగాయి. అశోక్ లేల్యాండ్ సంస్థ ప్లాంట్ ప్రారంభానికి వేగంగా చర్యలు చేపట్టింది. ఎలక్ట్రికల్ బస్సులే కాదు అన్ని రకాల బస్సుల బాడీ బిల్డింగ్‌ను తయారు చేసే విధంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంటు ఇదే.
మల్లవల్లి అశోక్ లేల్యాండ్ ఫేజ్ – 1లో 600 మందికి, ఫేజ్ – 2లో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దాదాపు 75 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంటులో అత్యాధునిక, సాంకేతిక ప్రమాణాలతో బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తారు. ఈ ప్లాంట్‌లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు BL- 6 మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు ఫేజ్-1, 2లలో సంవత్సరానికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. అశోక్ లేల్యాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, ట్రక్కుల ఉత్పత్తిలో 13వ స్థానంలోనూ ఉంది. ఇటీవల భారతదేశంలో 34వ ఉత్తమ బ్రాండ్‌గా ర్యాంక్‌ను పొందింది.