ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీని మించి ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఈ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి సోమవారం హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు.
మద్యం కుంభకోణం కేసులో తనను చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ప్రస్తావించారు మిథున్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని వివరించారు. కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, కొన్నింటికి అనుచిత లబ్ధి కలిగేలా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్లు అందులో ఆరోపించారని, ఇవి నిరాధారమైనవన్నారు మిథున్ రెడ్డి. సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేసిన నిందితులను అరెస్టు చేసేందుకు సీఐడీ చర్యలు తీసుకుంటోందని, ఈ మెమో కోసం తాను విఫలయత్నం చేశానని వెల్లడించారు. తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశముందన్నారు. ప్రత్యేకాధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమనుకున్నా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని తెలిపారు. ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్‌సభలో తాను హాజరుకావాల్సి ఉందని తెలిపారు. తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని, దర్యాప్తునకు సహకరిస్తానని పేర్కొన్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలను అమాంతం పెంచేసింది. ఆ ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేదం హామీ ఇచ్చిన వైసీపీ..అధికారంలోకి వచ్చిన సాకులు చెప్పింది. 2019 చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర‌్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. 2019 మే నెలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేశారు.
జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు. బ్రాండ్లతో సంబంధం లేకుండా రూ.150 నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు. ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరురా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోళ్ల తతంగం నడిచింది. మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది. ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించే వారు.
మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రూ.3వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఎంపీ మిథున్ రెడ్డి వరకు చేరాయి. వైసీపీలో కీలకంగా ఉన్న నాయకుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు. మరోవైపు మద్యం కొనుగోళ్లు, అక్రమాల వ్యవహారంలో వైసీపీ అగ్రనేతలపై కూడా చర్యలు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. మద్యం ప్రయోజనాలన్ని అంతిమంగా ఒకే చోటుకు చేరాయని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.