అధికార పార్టీ కార్యకర్తలం అనే అహంకారంతో వ్యవహరించే వారి ఆగడాలకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు వేదిక అయింది. పట్టణంలో ఏఆర్ ఎస్సై వెంకటేష్‌పై గెడ్డం నాగేంద్ర, ఏడుకొండలు దాడి చేశారు. వీరితో పాటు మరో 9 మంది కలిపి దాడి చేసినట్లు గుర్తించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోక్స్ యాక్ట్ 12, 354 d, 323 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద మొత్తం 11 మంది పై కేసు నమోదు అయింది.
పట్టణంలో అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుండగా.. ఎస్ఐ వెళ్లి మందలించాడని, అందుకే వారంతా కలిసి కొట్టారని తెలుస్తోంది. పైగా ఈ సంఘటన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు సమీపంలోనే జరగడం గమనార్హం. దాడికి పాల్పడిన వారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల అనుచరులు కావడంతో కేసును మాఫీ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు మొదలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే.. ఏఆర్ సిబ్బంది అంతా ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు.
ఏఆర్ ఎస్సై పై దాడికి పాల్పడిన వారు.. రాజకీయంగా ఎంతటి వారైనా సరే.. వారిమీద చర్య తీసుకోవాల్సిందేనని ఏఆర్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వారంతా పెద్ద ఎత్తున ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రాజకీయంగా ఇదిపెను దుమారంగా మారుతోంది.