ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్‌కు మంచి పట్టుంది. ఇతర పార్టీలకు చెందిన బడా నేతలంతా ఇప్పుడు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి కొనసాగుతున్న దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్‌లో కీలక నేతలు చాలా మంది వరంగల్‌కు చెందిన వారే . పార్టీలో చేరిన వారికి కూడా టీఆర్ఎస్ పెద్ద పీట వేసింది. గత ప్రభుత్వంలో మంత్రి కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు కీలక మంత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్. అయితే విద్యా సంస్థల ఛైర్మన్ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. కేసీఆర్ ఏ పనిచేసినా ఆయనతో కూడా సంప్రదిస్తారన్న ప్రచారం సాగుతుంది పార్టీలో . దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు ఉన్న అత్యంత సన్నిహిత టీఆర్ఎస్ నేతల్లో ఒకడిగా ఉన్నారు.
పార్టీలో చేరిన వెంటనే పదవులు..
వరంగల్ జిల్లా మొదటి నుండి రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా. ఇక్కడ నుండి రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఉన్నత పదవులు అధిరోహించిన వారే . ప్రభుత్వం ఏది ఉన్నా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు కామన్. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే అంతకు ముందే పార్టీలో ఉండి డిప్యూటీ సీఎంతో పాటు వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఎస్సీ సామజిక వర్గానికి చెందిన రాజయ్ ను పదవి నుండి తప్పించి మరీ అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి కట్టబెట్టారు. తరువాత 2018 ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమి పాలయ్యారు. అదే టీడీపీ నుండి పార్టీలో చేరిన ఎల్లబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఆయనకు ఈ సారి మత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్. దీంతో కడియం ప్రభావం పూర్తిగా పడిపోయింది. అయితే, పార్టీలో మొదటి నుండి ఉండి ఉద్యమంతో పాటు పార్టీని బలోపేతం చేసిన దాస్యం వినయ్ భాస్కర్‌కు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మంత్రి పదవి దక్కక పోగా, పార్టీలో అందరిలో ఒకడిగానే మిగిలి పోయారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవిలో ఉండగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన ప్రియారిటీ తనకు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉన్నట్టు ఎర్రబెల్లి సన్నిహితులు చెబుతుంటారు.
భారీ ఇంటి నిర్మాణం చేపట్టిన పల్లా..
ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఈ ముగ్గురు నేతల మధ్య ఇప్పుడు ఓ ఇల్లు గుబులు రేపుతోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతంలో భారీ ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ ఇల్లు పూర్తయితే ఆయన జిల్లాలో మరింత పట్టుసాధించే అవకాశం ఉందని ఆ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురి మధ్య అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తుంటే పల్లా కూడా ఇక్కడే పాగా వేస్తే ఎవరి పదవికి ఎసరు పెడతాడో అన్న ఆందోళన ఈ నేతల్లో నెలకొంది. ఇందుకు కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో పాటు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించారు. దీంతో కేసీఆర్‌కు ఆయన మరింత దగ్గరయ్యారు. పొద్దున లేస్తే ఆయన ముఖ్యమంత్రి చుట్టే తిరుగుతుంటారు. ఏ కార్యక్రమంలో అయినా పల్లా ఉండాల్సిందే అని కేసీఆర్ చెపుతుంటారని టీఆరెస్ నేతలు అంటుంటారు. ఇప్పటి వరకు ఆయన పెద్దగా వరంగల్‌పై దృష్టి సారించలేదు. దీంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని భావించిన ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు పల్లా ఇంటి నిర్మాణంతో భవిష్యత్‌లో ఏం జరగబోతోందన్న ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.