అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. తుళ్లూరు సమీపంలో ఇందుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
మొత్తం 21 ఎకరాల్లో ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్‌లో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటు రోగుల సంరక్షణకు ఎక్స్‌లెన్సీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఫస్ట్ ఫేజ్‌లో తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌తో ఏర్పాటుచేసి.. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
సెకండ్ ఫేజ్‌లో బెడ్ కెపాసిటీకి వెయ్యికి పెంచనున్నారు. ప్రత్యేక విభాగాలు, రీసెర్చి విభాగాల ఏర్పాటు, అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే ఏపీ ప్రజలకు పెద్ద ఉపశమనం దొరకనుంది. చికిత్స కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సకు చాలా సమయం పడుతుంది. ఇతర నగరాల్లో ఉన్నప్పుడు రోగులు, వారి కుటుంబ సభ్యుల వసతి కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అమరావతిలో ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే ఈ తిప్పలు తప్పనున్నాయి











