అలనాటి నర్తకి నటి ఎల్. విజయలక్ష్మికి నటసింహం బాలయ్య పాదాభివందనం చేయడం విశేషమే కదా. దీనికి బాలయ్యను అభినందించాల్సిందే. కించిత్ గర్వం ఉండని భోళా శంకరుడు బాలయ్య. పెద్దలంటే ఎంత గౌరవం చూపుతారో ఈ సంఘటనే నిదర్శనం. అభిమానులు అల్లరి చేస్తే కొట్టడం లోనూ వెనకాడరు! అభిమానం హద్దుల్లో ఉండాలని హెచ్చరిస్తుంటారు. అందుకే అభిమానులకు బాలయ్య అంటే ఇష్టం. కొట్టినా నువ్వే తిట్టినా నువ్వే అంటూ బాలయ్యను ఇష్ట పడతారు. ఇక ఈ మేలు కలయిక విషయానికి వస్తే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సాక్షిగా మరోసారి బాలకృష్ణ పెద్దలకు ఇచ్చే మర్యాద ప్రేక్షకులకు తెలిసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మిని సోమవారం హైదరాబాద్‌లో బాలకృష్ణ వ్యక్తిగతంగా కలిశారు. సినీ ప్రముఖులు సమక్షంలో ఆమెకు గౌరవ సత్కారం చేశారు.
మహానటుడు ఎన్టీఆర్ తో ఆమె 15 చిత్రాల్లో నటించారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. సిపాయి కూతురు సినిమాలో బాలనటిగా ఆమె పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె ఓ సైంటిస్టును పెళ్లాడి అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందుకున్నారామె. బాలనటిగా ప్రస్థానం ప్రారంభించి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి.. వెండితెరకు ప్యాకప్ చెప్పి కూడా 50 ఏళ్లవుతోంది. ఎన్టీఆర్ అవార్డు అందుకునేందుకు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగునేలతో, ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ‘తెలుగులో 50 సినిమాలు, ఎన్టీఆర్ తో 15 సినిమాలు చేశా. తెలుగులోనే కెరీర్ ప్రారంభం. సైంటిస్ట్ తో పెళ్లి జరిగింది. అందరూ సైన్స్ గురించే మాట్లాడేవారు. పాత జీవితాన్ని వదిలేశానే అని ఏడిస్తే లాభం లేదు.. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించాను.
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటుచేసిన అవార్డును అందుకోవడం ఎంతో సంతోషం. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడితో పరిచయం కావడం నా అదృష్టం. ఆయనలోని గొప్ప గుణాలను ఎన్నింటినో నేను నేర్చుకున్నాను. నేను రామారావు గారిని చూసేటప్పటికే ఆయన పెద్ద హీరో. జగదేక వీరుని కథ సినిమాలో వరించి వచ్చిన మానవ వీరుడు వరించి వచ్చాడని విచారమా’ అనే పాటను నేనింకా మరచిపోలేదు. నేను మొదటిసారి చేసిన సినిమా ఇది. ఆ పాట చిత్రీకరణ అప్పుడు ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన పక్కన బి. సరోజాదేవి కూర్చుని ఉన్నారు. పెద్ద స్టార్ అనే అహంకారం ఆయనలో ఏమీ లేదు. రామ్మా .. కూర్చోమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడే తెలుగు నేర్చుకున్నాను. విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి అవకాశాలు వచ్చాయి. రైలులో నా గురువు, అమ్మతో వచ్చి ప్రదర్శనలు ఇచ్చేదాన్ని’ అంటూ తన గత అనుభవాలను ఆమె నెమరువేసుకున్నారు. అలాంటి విజయలక్ష్మి పాదాలకు బాలయ్య నమస్కరించడం పెద్ద చర్చనీయాంశమైంది. నెటిజన్లు బాలయ్య వినమ్రతకు ఫిదా అవుతున్నారు.











