అవతార్.. ఒకప్పుడు ఈ సినిమా పెద్ద సంచలనం. 2009లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ ఏడాది డిసెంబరు 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సినిమాకి ఎందుకీ ప్రత్యేకత అంటే ఒకే ఒక్క సమాధానం దర్శకుడు జేమ్స్ కామెరాన్. మన రాజమౌళి రెండుమూడేళ్లకు సినిమా చేస్తుంటేనే ఇంత లేటా అని పెదవి విరిచేస్తున్నాం. మరి కామెరాన్ దర్శకత్వ పనితీరును చూస్తే ఏమంటారో? 1984లో టెర్నినేటర్ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. గ్రహాంతర జీవుల కథతో ఎలియన్స్ కూడా చేశాడు. 1997లో టైటానిక్ సినిమాతో ఆయన పేరు ఓ రేంజ్ లో మర్మోగిపోయింది.
2009లో అవతార్ చిత్రంతో మరో సంచలనానికి తెర తీశాడు. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 2.924 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత అవతార్ 2 ప్రకటించారు. 250 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కింది. 2014లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అవతార్ – ది వే ఆఫ్ వాటర్ ఎట్టకేలకు ఇప్పటికి పూర్తయింది. మొత్తం నాలుగు భాగాలుగా ఈ సిరీస్ రాబోతోంది. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ అవతార్ 2 కథ అంతా అండర్ వాటర్ లోనే సాగుతుంది. అవతార్ మొదటి భాగంతోనే సరికొత్త ఊహా ప్రపంచాన్ని ఆవిష్కరించారు జేమ్స్ కామరాన్.
ఈ సీక్వెల్ లో కూడా మనుషులకూ గ్రహాంతర వాసులకూ మధ్య సాగే వార్ నే చూపించనున్నారు. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లోనూ దీన్ని విడుదల చేయనున్నారు. అవతార్ మొదటి భాగం 2.42 గంటలు ఉండగా, ఈ రెండో భాగం 3.10 గంటల నిడివి ఉన్నట్లు సమాచారం. ఇందులో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టిస్, సిగౌర్నీ వీవర్ తదితరులు నటించారు. ఆస్కార్ అవార్డులను కొల్ల గొట్టిన అవతార్ సినిమా ఇంకెన్ని అద్భుతాలకు తెరతీయనుందో చూడాలి.