ప్రకాశం వైసీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది.. సీఎం జగన్ సొంత బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మరోసారి అధినేతకు చుక్కలు చూపిస్తున్నారు.. ఇటీవల అధిష్టానం చర్యలు సరిగా లేవంటూ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చిపోయిన బాలినేని, తాజాగా తన గన్ మెన్‌లని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఏకంగా డీజీపీకి లేఖ రాశారు.. ఇది ఇప్పుడు ప్రకాశం వైసీపీలో చిచ్చు రేపుతోంది..
ప్రకాశం జిల్లాలో కొన్ని రోజుల క్రితం భారీ ఎత్తున భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.. ఈ భూ కుంభకోణాల్లో ఓ రాష్ట్ర నాయకుడి మద్దతుతో కొందరిని తప్పించారని, వారిని కూడా కేసుల్లో చేర్చాలని పట్టు పడుతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలులో పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్స్, వీలునామాలతో వందల కోట్ల రూపాయల విలువయిన ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను కొల్లగొట్టిన సంఘటనలు వెలుగు చూశాయి.. ఈ కుంభకోణంలో పార్టీ టాప్ లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు బాలినేని శ్రీనివాస్.. దీనిపై బాలినేని దాదాపు రాజీనామా చేసినంత హడావిడి చేయడంతో వెంటనే జిల్లా ఎస్‌పీ మల్లికా గర్గ్ సిట్ ఏర్పాటు చేశారు..
ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్… గత వారం కొంతమందిని అరెస్ట్ చేసింది.. ఈ కుంభకోణాల్లో బాలినేని అనుచరులు సైతం ఉన్నారు.. ఇతర బడా నేతల అనుచరులు కొందరిని అరెస్ట్ చేశారు అధికారులు.. అయితే, జిల్లాలోని ఓ ప్రముఖ నేత ఒత్తిడితో కొందరిని అరెస్ట్ చేయకుండా తప్పించారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాలినేని.. కేవలం తన అనుచరులు, తననే టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.. మొత్తం నిందితులు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు..
బాలినేని డిమాండ్‌కి పోలీసు అధికారులు కుదరదని తేల్చి పారేస్తున్నారు.. దీంతో, ఆగ్రహానికి గురయిన బాలినేని ఏకంగా డీజేపీకి లేఖ రాశారు.. తన గన్ మెన్‌లను వెనక్కి పంపుతున్నట్లు వివరించారు.. ఇటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి ఫోన్ చేసి జిల్లా పోలీసు అధికారులు, యంత్రాంగం…. వైసీపీ ప్రజా ప్రతినిధులకు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇలా అయితే వారితో కలిసి పనిచేయడం కష్టం అని వివరించారు.. ఈ అంశంపై వెంటనే సీనియర్ అధికారులు జోక్యం చేసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఉన్నతాధికారులు తన డిమాండ్లపై సత్వర చర్యలు చేపట్టకపోతే, తన చర్యలు కూడా అంతకంటే వేగంగా ఉంటాయని ఏకంగా వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చిపడేశారట బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
సీఎం జగన్‌కి బాలినేని సమీప బంధువు కావడంతో, డీజీపీ వెంటనే రంగంలోకి దిగారు.. భూ కుంభకోణం సిట్‌లో దర్యాప్తు అధికారులను పెంచి ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచాలని జిల్లా ఎస్‌పీ డీజీపీ ఆదేశించారు.. దీంతో, ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగిందా లేక, మరో రూపంలో బయటపడుతుదా అనేది చూడాలి..