సినిమా అనేదే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు వెలుగుతారో ఎప్పుడు నలుగుతారో ఎవరికీ తెలియదు. అటు రంగస్థలం మీదా, ఇటు సినిమా రంగంలోనూ ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి పావలా శ్యామల దయనీయ స్థితిలో ఉంది. ఆమె జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి. గణేశ్ పాత్రో రాసిన పావలా నాటికలో నటించడంతో పావలా అనేది ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సాహయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ ఇప్పుడు చేతులెత్తి ఆర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల నిజజీవిత కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.. కంటతడి పెట్టిస్తోంది.
పావలా శ్యామల… ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన నటన గుర్తొస్తుంది. నిస్సహాయస్థితిలో ఉన్న ఈ సీనియర్ నటి ఆపన్నహస్తం కోసం చూస్తోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం పావలా శ్యామలకి మనోవేదనను కలిగిస్తోంది. గతంలో ఆమెకు కొంతమంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించింది.
తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పారు. ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదు చెప్తుదంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు.
పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు. అనేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అటువంటి సినీ కళామతల్లి ముద్దుబిడ్డకు నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell : 98 49 175713 సంప్రదించవచ్చు. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటోంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది.