వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఆధిపత్య ప్రదర్శనకు వైఎస్ వర్థంతిని వేదికగా చేసుకున్న ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు… చీరాల గడియారపు సెంటర్లోని వై.ఎస్. విగ్రహం వద్ద నున్వా నేనా అంటూ పోటా పోటీగా ప్లెక్సీలు ఏర్పాటుకు దిగారు. దీంతో ఇరువర్గాల నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
ఈ ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.., ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్ తో మాట్లాడి, చీరాలలోని పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వైఎస్ వర్ధంతి కార్యక్రమాల పేరుతో ఆమంచి, కరణం వర్గాలు మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తరాదని, ప్రశాంతంగా కార్యక్రమాలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని, ఆయన ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆమంచి, కరణం వర్గాల్లో ఎవ్వరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.., వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
ఒకే ఒరలో రెండు కత్తులు…!
కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ప్రకాశం జిల్లాలో కీలకమైన నేతలు. దశాబ్దాల అనుభవం ఉన్న బలరాం, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమంచి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. బ్యాలెట్ పోరులో బలరాం విజయం సాధించగా, ఆమంచి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
దీనికి తోడు ఇప్పుడు బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరడం, బలరాం అనధికారింకంగా వైసీపీలో కొనసాగుతుండటంతో.., ఆమంచి మరింత ఆగ్రహంతో ఉన్నారు. దీంతో చీరాలలో ఏ చిన్న కార్యక్రమం అయినా.., రెండు వర్గాలు తమ బల ప్రదర్శనకు వేదికగా చేసుకుంటున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. చూడాలి.., ఈ వైఎస్ వర్ధంతిని ఫ్లెక్సీ ల గొడవతోనే ఆపేస్తారో…, లేక క్రిమినల్ కేసుల దాకా తీసుకువెళ్తారో…!