వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జగన్ పిలుపుతో ఆయన వెంట నడిచారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. అసలు సిసలైన గిరిజనుడుగా మంత్రి పదవి పొందేందుకు అన్ని అర్హతలూ కలిగివున్నారు. అయినప్పటికీ అమాత్య పదవి అందని మావిపండుగానే మారిపోయింది. అందుకు కారణం ఆయన ముక్కుసూటి తనం , నచ్చని అంశాలపట్ల నిర్భయంగా వినిపించే ధిక్కారస్వరం తనని వెనక్కు నెట్టేస్తున్నాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుల్లో గల విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం (ఎస్టీ రిజర్వుడ్) ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర జీసీసీ మేనేజర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 2004లో వైఎస్ స్ఫూర్తితో రాజకీయాలలోకి వచ్చారు. అప్పటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సాలూరు నుండి టీడీపీ అభ్యర్థి ఆర్.పి. భంజదేవ్ పై పోటీ చేసి ఓడిపోయారు. భంజదేవ్ అసలైన గిరిజనుడు కాడని కొంతమంది వ్యక్తుల సహకారంతో కోర్టులో కేసు వేశారు. 2006లో భంజదేవ్ గిరిజనుడు కాదని కోర్టు తేల్చడంతో ఆయన పదవీచ్యుతుడు అయ్యారు.
2004సాధారణ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన రాజన్నదొర కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2006లో ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేశారు. అలా అదృష్టం కలిసొచ్చి ప్రజా బేలెట్ ద్వారా ఓడినవ్యక్తి ఎమ్మెల్యే గా బాధ్యతలు చేపట్టడం అప్పట్లో విశేషంగా చర్చనీయాంశమైంది.
అనంతరం ఆయన వెనుదిరిగి చూడలేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుస్తూనే వున్నారు. అలా.. 2009, 2014, 2019లో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొంది జగన్ గూటికి వెళ్లడం, 2014లో వైసీపీ తరపున గెలిచి ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. 2019లో వైసీపీ తరపున గెలవడం, ఆ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అమాత్య పదవి వరిస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. అయితే వైఎస్ జగన్ సాధారణ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోనూ కొనసాగిస్తున్న తరుణంలో పక్కనున్న శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫానుతో అతలాకుతలమైంది.
తుఫాను ప్రభావిత ప్రాంతాలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. జగన్ ఆ దిశగా యోచన చేయకపోవడాన్ని రాజన్నదొర మీడియా ముఖంగా తప్పుపట్టారు. జగన్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపు సక్రమంగా జరగడంలేదని ఇంకోసారి బహిరంగంగా విమర్శించారు. ఈ విషయాన్ని గుర్తించిన జగన్ రాజన్నను పక్కన పెట్టినట్లు రాజకీయ పరిశీలకుల భావన. ఏదేమైనా ఏ ఎండకు ఆ గొడుగు పట్టాల్సిన ప్రస్తుత రాజకీయాల్లో రాజన్న లాంటి వారికి మంత్రి పదవి దక్కకపోవడంలో వింత లేదు.











