ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాల రీత్యా సురేష్ రైనా ఈ సీజన్ కు జట్టుకు దూరమయ్యాడు. మామ హత్యకు గురికావడంతో రైనా ఇండియాకు వచ్చేశాడని మొదట వార్తలు వచ్చాయి. ఆ తరువాత రైనాకు జట్టు మేనేజిమెంట్ కు గొడవ జరిగిందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ సందర్భంలో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ పరోక్షంగా రైనాను ఉద్దేశించి సీనియర్లు సర్దుకుపోవాలని విజయగర్వాన్ని తలకెత్తించుకోకూడదని కామెంట్ చేశారు. దీంతో శ్రీనివాసన్ వైఖరి కారణంగానే రైనా జట్టుకు దూరమయ్యారని చర్చ జరుగుతోంది.
తాజాగా ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఈ సీజన్ కు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకొంది. కానీ ఇప్పటి వరకు హర్బజన్ సింగ్ జట్టులో చేరలేదు. దుబాయ్ ను పక్కన పెడితే చెన్నైలో జరిగిన క్యాంపుకు కూడా బుజ్జి హాజరు కాలేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు సెప్టెంబర్ 1 లోగా దుబాయ్ చేరుకోవాలి. ఆరు రోజులు క్వారంటైన్ లో ఉండాలి. మూడు కరోనా టెస్టులలో నెగటివ్ వస్తే అప్పుడు మాత్రమే వారిని ‘బయో బబుల్’ సర్కిల్ లోకి అనుమతించే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బజ్జి దుబాయ్ కు రాకపోవడంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
మరో సీనియర్ ఆటగాడు తప్పుకోవడంతో యజమాని శ్రీనివాసన్ పై నెటిజన్స్ విమర్శలు వస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే రైనాపై విమర్శలు చేసిన శ్రీనివాసన్ ధైర్యం ఉంటే బజ్జి గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకో వైపు రైనా, హర్బజన్ సేవలు దూరం కావడంతో సీఎస్కే జట్టు బలహీనంగా మారింది. ఇప్పటికైనా శ్రీనివాసన్ తీరు మారకపోతే ధోని మినహా జట్టులో సీనియర్లు ఉండరని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం బీసీసీఐకి కూడా చిక్కులు తెచ్చి పెట్టింది. కరోనా ఉదృతిలో ఐపీఎల్ నిర్వహించవలసిన అవసరమేముందని వారు ప్రశ్నిస్తున్నారు.











