బాలినేని శ్రీనివాస్ రెడ్డి..మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు. అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా కూడా చేశారు. ఐతే ఇటీవల మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనలో చేరిన విషయం తెలిసిందే. జనసేనలో చేరిన ఇన్నాళ్లూ బాలినేని మౌనంగానే ఉన్నారు. కానీ పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని. నేరుగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్‌గా బాలినేని చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతానంటూ బాలినేని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. జగన్ తన ఆస్తులను కాజేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం ఒక్కరోజులో చెబితే సరిపోదన్నారు. జగన్ చేసిన అన్యాయాలన్ని త్వరలోనే బయటపెడతానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో సగానికి పైగా అమ్ముకున్నానని, ఐనప్పటికీ లెక్క చేయలేదన్నారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలందరిపైనా విచారణ వేయాలని డిమాండ్ చేశారు బాలినేని. తన మీద కూడా ఎంక్వైరీ చేయాలని కోరారు. తప్పు ఎవరు చేశారో, కోట్లు ఎవరు సంపాదించారో తెలుతుందన్నారు. ఈ ఉక్రోషం, బాధ, తనకు, తన కుటుంబానికే తెలుసన్నారు. వైఎస్సార్, ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమన్నారు బాలినేని. రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డికి విధేయతతోనే మంత్రిగా నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే జగన్ వెంట నడిచానన్నారు బాలినేని. మంత్రి పదవి ఇచ్చి తీసేసినా తను బాధపడలేదన్నారు. ఆ పదవిని తాను లెక్క చేయలేదన్నారు.
రఘురామకృష్ణంరాజు ఏదో మాట్లాడితే ఆయనను లోపల పెట్టించి కాళ్లు, చేతులు విరగ్గొట్టించారని, మరీ 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే ఆ కుటుంబానికి బాధ కలగదా అని ప్రశ్నించారు బాలినేని. ఆ రోజే తాను చంద్రబాబు ఫ్యామిలీపై వ్యాఖ్యలను ఖండించానన్నారు. పవన్‌కల్యాణ్‌పైనా పోసానితో మాట్లాడించారని, పవన్ తలుచుకుంటే జనసైనికులతో తుక్కుతుక్కుగా కొట్టించేవారన్నారు. అదే తానైతే రాళ్లతో కొట్టించేవాడినంటూ బాలినేని హాట్ కామెంట్స్ చేశారు.
తాను ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రినయ్యానన్నారు బాలినేని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్‌ను తానేనాడు విమర్శించలేదన్నారు. బాలినేని లాంటి మంచివాడు వైసీపీలో ఉన్నాడని ఆనాడు పవన్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఆ రోజే తాను జనసేనలో చేరకపోవడం దౌర్భాగ్యమన్నారు బాలినేని. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్న, చిన్న కార్యకర్తలను లోపల వేశారని, లోపల వేయాల్సింది కోట్లు సంపాదించిన వారినని చెప్పారు బాలినేని. పవన్‌ను కార్పొరేటల్‌తో పోల్చిన జగన్‌కు కౌంటర్ ఇచ్చారు బాలినేని. జగన్ తండ్రి దయతో ముఖ్యమంత్రి అయ్యాడని, భవిష్యత్ అవు చూద్దామంటూ సవాల్ విసిరారు.
తాను పవన్‌ను కలిసినప్పుడు కొన్ని పత్రికలు, మీడియా..తప్పుడు ప్రచారం చేశాయన్నారు బాలినేని. తనవల్ల పవన్‌కు చెడ్డపేరు రాకూడదన్నారు. పదవి ఆశించి జనసేనలో చేరలేదన్నారు. తన ధ్యేయం ఇంకా మంచి స్థాయికి ఎదగాలన్నారు. పవన్‌తో సినిమా తీయాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కష్టపడి పనిచేసిన జనసేన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేలా చొరవ చూపాలని చంద్రబాబును కోరారు. తన ప్రాణం ఉన్నంతవరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటానన్నారు