వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఆయన పాత బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై స్వరం పెంచుతున్నారు.. వైసీపీ అధినేతపై పరోక్ష విమర్శలు చేశారు.. నాలుగు రోజుల క్రితం కాకినాడ పోర్టు అంశంలో సీఐడీ విచారణకు హాజరయిన విజయసాయి రెడ్డి… జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనలో విశ్వసనీయత, నిబద్ధత ఏమాత్రం తగ్గలేదని, తనపై నమ్మకాన్ని జగన్ కోల్పోయాడని కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి.. సజ్జల, భారతి కోటరీలో జగన్ తన చుట్టూ ఏం జరుగుతుందో మరిచిపోయారని, వారి నుండి బయటకు రావాలని, అప్పుడే జగన్ బాగు పడతారని మండి పడ్డారు..
ఈ వ్యాఖ్యలు రేపిన దుమారం మరిచిపోకముందే తాజాగా మరోసారి విజయ సాయి రెడ్డి…. వైసీపీ అధినేత జగన్ కోటరీపై మరో బాంబ్ పేల్చారు.. ఓ చిన్న కథతో, జగన్, ఆయన టీమ్‌ని పోల్చారు..
పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అంటే ముక్తాయించారు విజయసాయి రెడ్డి..
జగన్, విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ ఉందని ఎన్నికలకు ముందే లీకులు వచ్చాయి.. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆ అభిప్రాయ బేధాలు సమసిపోతాయని వైసీపీ ముఖ్యనేతలు భావించారు.. ఎన్నికల తర్వాత అనూహ్యంగా విజయసాయి రెడ్డి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.. మూడేళ్ల పదవీ కాలం ఉన్నా స్వయంగా పదవిని త్యజించారు విజయ సాయి రెడ్డి..
అయితే, జగన్ అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి రెడ్డి చెప్పిన రాజు కోటరీ కథ వెనక సీక్రెట్ ఉందని, ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యే సమయానికి, వైజాగ్ బీచ్ దగ్గర ఆయన కూతురు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు.. దానిని మీడియాలో కార్నర్ కాకుండా చూసుకోవాలంటే జగన్‌పై కథ చెప్పడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట విజయసాయి రెడ్డి.. అందుకే, సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్డి రాజు కథను చెప్పుకు వచ్చాడని మరికొందరు విమర్శిస్తున్నారు.. మరి, విజయసాయి రెడ్డి, జగన్ మధ్య నిజంగానే లోపాయికారీ ఒప్పందం నడుస్తోందా.? ఆ సీక్రెట్ త్వరలోనే బయటపడనుందా..? లేదా?. అనేది త్వరలోనే తేలనుంది..