గత రెండేళ్లుగా మెట్టినెల్లు తెలంగాణలో రాజీ లేని పోరాటం చేసిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల.. తన రాజకీయ క్షేత్రాన్ని మార్చుకుంటున్నారు.. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌లో పోరాటానికి సిద్ధం అవుతున్నారు.. ఇప్పటికే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి రెడీగా ఉన్న జగన్ అన్న వదిలిన బాణం.. హై కమాండ్ పెద్దల ఆదేశాలతో రూట్ మార్చారు.. త్వరలో ఎన్నికలు జరగనున్న ఏపీలో బరిలోకి దిగడానికి సమాయత్తం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది…
నిన్నమొన్నటిదాకా తన రాజకీయ పోరాటం కేవలం తెలంగాణకే పరిమితం అని లక్ష్యం నిర్దేశించుకున్న షర్మిల మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ దిశానిర్దేశంతో ఏపీలో పోటీకి రెడీ అవుతున్నారు.. కాంగ్రెస్ బాధ్యతలను తీసుకోవడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలలో కథనాలు వెలువడుతున్నాయి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకి కీలక పదవులు ఇవ్వడానికి ఆ పార్టీ పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ససేమిరా అంగీకరించలేదు.. ఇటు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే ఆదికేశవులు నచ్చజెప్పడంతోపాటు షర్మిలకి కన్నడ నుండి రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేశారు.. దీంతో, ఆమె ఏపీలో అడుగుపెట్టడానికి అంగీకరించారని తెలుస్తోంది..
ఏపీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న షర్మిలకు అప్పుడే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది.. ఏపీలో ఆమె ఎక్కడి నుండి తన రాజకీయ అడుగులను షురూ చేయాలో రోడ్ మ్యాప్ వచ్చేసింది.. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంశంపై ఆమె తొలిసారిగా వైజాగ్‌లో భారీ బహిరంగ సభకి ప్లాన్ చేసుకున్నారు.. విశాఖ ఉక్కు ఏపీ ప్రజలకు సెంటిమెంట్.. విశాఖ ఉక్కుని ప్రయివైటీకరణ చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది.. దీనిని అదానీ కంపెనీకి కట్టబెట్టాలని యోచిస్తోందని, అందుకే నష్టాలు చూపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అదానీతో తెరవెనక చీకటి ఒప్పందాలకు పాల్పడుతోందని జగన్ సర్కార్‌పై విమర్శలు ఉన్నాయి. దీంతో, మోదీ సన్నిహితుడు, గుజరాత్ మల్టీ మిలియనీర్‌తో పోరాటానికి జగన్ వెనకడుగు వేస్తున్నారు.. దీనినే ఆయుధంగా చేసుకోవడానికి షర్మిల సిద్ధం అవుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ రాజ్యసభ సాక్షిగా అంగీకరించింది. ఇది కూడా షర్మిలకు కలిసిరానుంది.. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.. అందుకే, జగన్‌ని ఈ దఫా ఓడిస్తే, 2029 నాటికి తమకు లైన్ క్లియర్ అవుతుందని, ఇటు జగన్‌కి చెక్ పెట్టే ప్రయత్నం ఫలిస్తుందని లెక్కలు కడుతోంది టెన్ జన్ పథ్.. ఇదే లక్ష్యంతో షర్మిలకు బడా టార్గెట్ నిర్దేశించింది. ఇటు, షర్మిల ఏపీలో ఎంట్రీ ఇస్తే… జగన్ నుండి టికెట్‌లు ఆశించి భంగపడిన అనేక మంది వైసీపీ నేతలు కాంగ్రెస్ నుండి రేసులో నిలవడం గ్యారంటీ అనే సంకేతాలు వెలువడుతున్నాయి.. బాలినేని లాంటి సీనియర్‌లు షర్మిల పంచన చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. రాబోయే కొద్దిరోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కడ ఖాయం. మరి, షర్మిల ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి..