పిల్లల ద్వారా కరోనా వ్యాప్తి (స్ప్రెడర్స్) చెందుతుందనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. అయితే వారు వ్యాధిని తీవ్రంగా వ్యాప్తి చేసే ‘సూపర్ స్ప్రెడర్స్’ కాదని తెలిపారు.
నవంబరు 2 నుంచి బళ్లు తెరుస్తున్న క్రమంలో ఇలాంటి హెచ్చరిక ఒకటి రావడం అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే కొన్ని చోట్ల పాఠశాలలకు వెళ్తున్న తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండటంతో వారిలో కొంతమందికి కరోనా సోకింది. వారి ద్వారా తల్లిదండ్రులకు కూడా సోకడంతో పిల్లలను మళ్లీ పాఠశాలకు పంపించడం ఇప్పట్లో జరగదని తల్లిదండ్రులు బలంగానే చెబుతున్నారు.
ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు తోటి విద్యార్థుల ద్వారా కరోనా సోకడం కన్నా ఉపాధ్యాయుల ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిసింది. భారత్ లో 17 ఏళ్లలోపు వారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే కొవిడ్ బారిన పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ఐదేళ్ల లోపు వారు ఒక శాతం కన్నా తక్కువగా వ్యాధి బారిన పడిన వారిలో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరి కొన్ని రోజులు భారత్ లో కరోనా గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఎంత పాఠశాలలు తిరిగి ప్రారంభించినప్పటికీ తల్లిదండ్రులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకునే బడులకు పంపాలని వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు తెలుపుతున్నాయి.