బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీని సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ మోనాల్, సోనుసూద్ ల పై స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు.

ఇదిలా ఉంటే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ఈ మూవీతోనే డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించేందుకు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కఫూర్ అయితే బాగుంటుందని.. బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బెల్లంకొండా సాయిశ్రీనివాస్ ఇప్పటి వరకు సమంత, కాజల్ అగర్వాల్, తమన్నాల సరసన నటించాడు. ఇప్పుడు ఏకంగా జాన్వీ కఫూర్ తో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. జాన్వీ కఫూర్ ఒకే చెబుతుందో లేదో చూడాలి.











