వెంకటేశ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘శత్రువు’ ఒకటిగా కనిపిస్తుంది. ఎమ్మెస్ రాజు తొలిసారిగా నిర్మించిన ఈ సినిమాకి, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 1991లో ఇదే రోజున ఈ సినిమా విడుదలైంది. ఈ రోజుతో 30 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెస్ రాజు ఈ సినిమా గురించి ప్రస్తావించారు…
‘శత్రువు’ సినిమాను నిర్మించి అప్పుడే 30 ఏళ్లు పూర్తయ్యాయా అనిపిస్తుంది. ఈ మధ్యనే ఆ సినిమాను తీసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే షూటింగు సమయంలోని విషయాలు .. విశేషాలు అన్నీ కూడా ఇంకా నా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.
వెంకటేశ్ .. విజయశాంతి ఈ సినిమాలో పోటీపడి నటించారు. పాటలను ఊటీలో చిత్రీకరించాము. కెమెరామెన్ గోపాల్ రెడ్డిగారు పాటల చిత్రీకరణలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. నేను నిర్మించిన సినిమాల్లో ఎక్కువసార్లు వేసుకుని చూసిన సినిమా ఇదే. నేను .. కోడి రామకృష్ణ గారు .. సత్యమూర్తిగారు కలిసి ఈ కథపై కసరత్తు చేశాము. కథ తయారవుతున్నప్పుడే ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారనేది అనేసుకున్నాము. కథ వినగానే ఇటు వెంకటేశ్ గారు .. అటు విజయశాంతి గారు ఓకే చెప్పేశారు. ఈ సినిమా అనుకున్నట్టుగా రావడానికి కారణం, నాకు .. కోడి రామకృష్ణగారికి గల స్నేహం .. ఆత్మీయత .. అనుబంధం అనుకోవచ్చు.
వెంకటేశ్ గారు ఒక వైపున ‘బొబ్బిలి రాజా’ చేస్తూ మరో వైపున ‘శత్రువు’ చేశారు. ‘బొబ్బిలిరాజా’ షూటింగు సమయంలో ఆయన భుజం నొప్పికి గురయ్యారు. అదే పెయిన్ తో ఆయన ‘శత్రువు’ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశారు. నిర్మాతల సాధకబాధకాలు తెలుసు కనుక, షూటింగు ఆగనీయలేదు. ఈ సినిమా ఫస్టు కాపీ చూడగానే రామానాయుడు గారు నన్నెంతో అభినందించారు. ఈ సినిమా విడుదలైన తరువాత పెద్ద గొప్పగా లేదనే టాక్ వచ్చింది. దాంతో నేను చాలా టెన్షన్ పడిపోయాను. కానీ సినిమా నెమ్మదిగా పుంజుకుంది .. భారీ వసూళ్లను రాబట్టింది. నా కెరియర్లోను .. వెంకటేశ్ .. విజయశాంతి కెరియర్లోను బెస్ట్ మూవీగా నిలిచింది” అని చెప్పుకొచ్చారు.











