ఏపీలో సామాజిక ఫించన్ల ఏరివేత ప్రక్రియ కలకలం రేపుతోంది. నవశకం సర్వే ఆధారంగా ఫించన్ల ఏరివేత మొదలు పెట్టారు. ఆదాయ పరిమితి, ఒకే కుటుంబంలో రెండు ఫించన్లు ఉంటే వెంటనే ఒకటి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను డిసెంబరు 15కల్లా పూర్తి చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాలంటీర్లు ఫించనుదార్ల అర్హత వివరాలను సేకరించే పనిలోపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగానే ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది.
ఎంత మందికి కట్ చేస్తారు?
ఏపీలో 60 లక్షల మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల ఫించన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రతి నెలా సామాజిక ఫించన్ల పంపిణీకి రూ.1400 కోట్లు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా రూ.250 పెంచుకుంటా వెళ్లాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ లోనే సామాజిక ఫించను రూ.2500 చేయాల్సి ఉంది. అయితే అది నేటికీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక ఫించనుదారుల ఓట్లు చాలా కీలకం.
ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను ఫించనుదారులు రూ.250 ఎప్పుడు పెంచుతారని నిలదీస్తున్నారు. ఈ విషయం అమాత్యులు సీఎంకు చేరవేశారట. సామాజిక ఫించను పెంచకుండా ఎన్నికలకు వెళ్లలేమని చెప్పడంతో సీఎం కొత్త స్కెచ్ వేశారని తెలుస్తోంది. పదిశాతం ఫించన్లను కట్ చేస్తే ఆ మిగిలిన సొమ్ముతో రూ.250 వెంటనే పెంచవచ్చని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కనీసం 5 లక్షల ఫించన్లు ఏరివేయాలని ఆదేశించారని సమాచారం. వెంటనే అధికారులు వాలంటీర్లను రంగంలోకి దింపారు.
Also Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?
టీడీపీ వారే టార్గెట్
ఏపీలో వాలంటీర్లదే రాజ్యం. వారు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. ఇక ఫించన్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరివి తీసివేయాలనేది కూడా నిర్ణయించేది వాలంటీర్లే. నవశకం సర్వే పేరుతో ఫించన్లు ఏరివేతకు వాలంటీర్లను పురమాయించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నారు. ఏ ఇంట్లో వారు ఏ పార్టీ సానుభూతిపరులో వాలంటీర్లకు స్పష్టంగా తెలుసు. అందుకే వైసీపీకి ఓటు వేయరని భావించిన వారి సామాజిక ఫించన్లు కట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరుల సామాజిక ఫించన్లు తీసివేయడానికి రంగం సిద్దం అవుతోందనే భయాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి.
భవిష్యత్తులో కూడా అంతేనా?
ఏటా ఫించను రూ.250 పెంచడం అంటే ఏమో అనుకున్నారు జనం. ఇప్పుడు అర్థం అవుతోంది. ఫించను పొందుతున్న వారిలో ఏటా పది శాతం మందిని కట్ చేస్తే మిగిలే సొమ్ముతో రూ.250 పెంచుతారని అర్థం అవుతోంది. రాబోయే మూడున్నర సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తారా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఫించను పెరగడం దేవుడెరుగు, అసలు ఉంటుందో లేదోనని జనం బెంబేలెత్తిపోతున్నారు.
Must Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!











