వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయారా? వరుస చట్టపరమైన చిక్కులు, వేగవంతమవుతున్న దర్యాప్తు సంస్థల చర్యలతో ఏం చేయాలో తోచని స్థితిలో ఢిల్లీ పీఠంపై విమర్శలకు దిగుతున్నారా? అంటే అవుననే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి అనిల్ చంద్రతో భేటీ అనంతరం జగన్ మాట్లాడిన తీరు, ఆయనలోని నైరాశ్యాన్ని తేటతెల్లం చేస్తోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈడీ (ED), సీబీఐ (CBI) కేసులతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ శరవేగంగా ముందుకెళ్తుండటంతో, తనను తాను కాపాడుకునేందుకు కాక్రోచ్లు, నక్సలిజం అంటూ విచిత్రమైన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో, రాజకీయంగా మనుగడ సాగించడం జగన్కు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా తనపై వస్తున్న కేసుల నుంచి దృష్టి మళ్లించే ప్లాన్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో ‘ఇండియా కూటమి’ (INDI Alliance) కూడా జగన్ను చేరదీసేందుకు గానీ, ఆయనకు మద్దతు ఇచ్చేందుకు గానీ సిద్ధంగా లేకపోవడం వైఎస్సార్సీపీని మరింత ఒంటరిని చేసింది. ఇటు కేంద్రంలోని అధికార కూటమికి, అటు ప్రతిపక్ష కూటమికి సమాన దూరంలో ఉండిపోయిన జగన్, ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా రక్షణ లేని స్థితిలోకి నెట్టబడ్డారు.
న్యాయస్థానాలు, రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో పెరుగుతున్న నిరాశకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. “పాపం గవర్నర్.. మనిషి మంచోడే, కానీ ఆయన చేయగలిగిందేమీ లేదు” అని, హైకోర్టుపై కూడా వ్యాఖ్యలు చేయడం ద్వారా వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని సడలించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించినప్పటికీ, కేసుల వేగానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని గ్రహించే ఆయన ఇటువంటి ఉద్వేగపూరిత, నాటకీయ వ్యాఖ్యలకు పూనుకుంటున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సొంత బాబాయి హ*త్య కేసు విచారణ తుది దశకు చేరుకోవడం, ఆర్థిక నేరాల కేసులు మూలల్లోకి నెడుతుండటంతో జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిందనే ప్రచారం సాగుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజల సానుభూతి పొందేలా కాక్రోచ్లు, అరాచకం అనే పదాలను అడ్డుపెట్టుకుని కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శకులు మండిపడుతున్నారు. ఆత్మరక్షణలో పడి కేంద్రంపై, వ్యవస్థలపై విమర్శలు గుప్పించినంత మాత్రాన చట్టం తన పని తాను చేయకుండా ఆగిపోదని, జగన్ ఎన్ని ఎత్తుగడలు వేసినా కేసుల ముప్పు నుంచి తప్పించుకోవడం సులభం కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.











