నిర్ణయాత్మక పోరులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆఖరి వన్డేలో భారత్ ఆకట్టునే ఆట ఆడింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకున్న కోహ్లీ సేన.. వన్డే ఫార్మాట్‌లోనూ సత్తా చాటింది. 51 రోజులపాటు సాగిన సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలోను విజయం సాధించింది.
ఆద్యంతం అదరహో..
పుణె వేదికగా రసవత్తరంగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 48.2 ఓవర్లలో ఆలౌటై ప్రత్యర్థి ముందు 330 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంత్(78), ధావన్(67), హార్దిక్ పాండ్య(64) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
ఆరంభంలోనే ఎదురుదెబ్బ..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆదిలోనే భువీ దెబ్బకొట్టాడు. ఫామ్లో ఉన్న జేసన్ రాయ్‌ను తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో ఎల్ బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టోక్స్(35), మలన్(50), లియామ్ లివింగ్స్టోన్(36) పర్వాలేదనిపించారు.
కరన్.. వణికించేశాడు!
ఇంగ్లాండ్ స్కోరు 168 వద్ద ఆరో వికెట్‌గా మలన్ అవుటైన సమయంలో క్రీజులోకి వచ్చాడు సామ్ కరన్. మొయిన్ అలీ(29)తో ఏడో వికెట్‌కు 32 పరుగులు, ఆదిల్ రషీద్(19) ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. మార్క్ వుడ్ తో 9వ వికెట్‌కు ఏకంగా 60 పరుగులు రాబట్టాడు. విజయానికి 23 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో.. వుడ్(14) రనౌటయ్యాడు. చివరి 3 ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కరన్‌ను కట్టడి చేశారు. 48వ ఓవర్లో భువీ 4, 49 ఓవర్లో హార్దిక్ పాండ్య 5 పరుగులే ఇచ్చారు. చివరి ఓవర్ వేసిన యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్.. 6 పరుగులే ఇవ్వగా.. విజయం భారత్ సొంతమైంది. మొత్తంగా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఠాకుర్(4), భువనేశ్వర్(3), నటరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Must Read ;- క్రునాల్ కంటతడి : తండ్రికి అర్ధ సెంచరీ అంకితం.. వీడియో వైరల్










