( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శుక్రవారం ఉదయం మెయిన్ గేటు, బి సి గేటు వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. శనివారం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూర్మనపాలెం జంక్షన్ వద్ద సుమారు గంట పాటు నిరసన కార్యక్రమాలకు కమిటీ సన్నాహాలు చేస్తోంది. భౌతిక దూరం పాటించడం. మాస్క్ ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఉద్యోగులకు సూచిస్తున్నారు.
అనేక రూపాల్లో నిరసనలు..
విశాఖ ఉక్కు ఉద్యమం లో భాగంగా ఇప్పటివరకు ర్యాలీలు, రాస్తారోకోలు, రాష్ట్ర బంద్, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ, గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మరోవైపు ట్రేడ్ యూనియన్లు కు చెందిన నాయకులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సిపి మీ వెంట ఉన్నామంటూ పదే పదే ప్రకటనలు చేస్తోంది. సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. జాతీయ స్థాయి నాయకులతో భారీ బహిరంగ సభను కూర్మన్నపాలెం, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో, సాగర తీరంలో నిర్వహించారు. అదేవిధంగా రైతు ఉద్యమ సంఘం జాతీయ నాయకులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది.
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద..
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష తోపాటు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మరో రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని గత 50 రోజులుగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం ఇసుమంతైనా స్పందించడం లేదు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో..
రెండు నెలలుగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడంతో ఉద్యమకారులు భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేయలేదు. రిలే నిరాహార దీక్షా శిబిరాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని యూనియన్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు.
Must Read ;- ఆ ట్రస్టుకైతే ఆఘమేఘాలు.. విశాఖ ఉక్కులో దానికి అధికారులకు తీరికే లేదట!











