పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. అలాంటి పండగే భీమ్లానాయక్ విషయంలో నెలకొంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
భీమ్లానాయక్ (పవన్ కళ్యాణ్) పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్. కర్నూలు జిల్లా హఠకేశ్వర్ మండలం పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తుంటాడు. డానియల్ శేఖర్ (రానా) ఓ రిటైర్ ఆర్మీ ఉద్యోగి. ఓ మాజీ ఎంపీ తనయుడు. మద్యం సీసాలతో వెళుతూ తనిఖీ పోలీసులకు చిక్కుతాడు డానియల్ శేఖర్. పోలీసులతో జరిగిన గొడవ చివరికి అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లేదాకా వెళుతుంది. అతని అహంకారం, భీమ్లానాయక్ ఆత్మాభిమానం.. ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే ఈ కథలోని పాయింట్. భీమ్లానాయక్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించగలుగుతాడు డానియల్ శేఖర్. చివరికి ఒకరికొకరు చంపుకునే వరకూ పరిస్థితులు వెళతాయి. అసలు భీమ్లా నాయక్ ఎవరు? అతని వెనకున్న కథేంటి? ఈ ఇద్దరి మధ్యా జరిగిన పోరు ఎలా ముగిసింది అన్నదే ఈ సినిమా.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఎలా తీశారు అని చెప్పాల్సి వస్తే మలయాళ మాతృకలో చాలా మార్పులు చేశారన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రథమార్థంలో చాలా సన్నివేశాలు మలయాళ మాతృకకు తగ్గట్టే ఉన్నాయి. ద్వితీయార్థంలో మాత్రం కథలో చాలా మార్పులు చేశారు. ప్రథమార్థంలో పావుగంట సేపు సినిమా వేగంగానే నడిచినా ఆ తర్వాత కథనం నెమ్మదించింది. భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్యామీనన్) కు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో సాగతీత కనిపించింది. హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా కథను మార్చారు. మాస్ లో పవన్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ ప్రథమార్థంలో కథనంలో బిగువు సడలింది. మళ్లీ ద్వితీయార్థం వచ్చే సరికి వేగం పెరిగింది. ప్రథానంగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి.
భీమ్లానాయక్ పాత్రను వన్ మ్యన్ షోగా పవన్ కళ్యాణ్ నడిపించారు. డానియల్ శేఖర్ పాత్రలో రానా ఒదిగిపోయారు. రానా భార్యగా నటించిన సంయుక్తా మీనన్ తన పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన, ఆ సన్నివేశాన్ని మలచడంలో దర్శకుడు చూపిన శ్రద్ధ, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాని ఓ మెట్టు పైన నిలబెట్టాయి. రానా తండ్రిగా సముద్ర ఖని పాత్ర చివరికి వచ్చే సరికి తేలిపోయింది. అతని విలనిజం ఈ సినిమాలో పండలేదు. పాత్ర నిడివిని తెలుగులో పెంచినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాని ఓమెట్టు పైన నిలబెట్టింది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. ముఖ్యంగా లాలా భీమ్లా పాట విజిల్స్ వేయిస్తుంది. దీనికి సమకూర్చిన నృత్యరీతులు హైలైట్ అని చెప్పాలి.
మాటల మాంత్రికుడి మెరుపులు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆయన సంభాషణల్లో మంత్రం ఎక్కడా లేదు. కేవలం కథను దృష్టిలో పెట్టుకుని ఆ కథ పరిథి మేరకే సంభాషణలు సమకూర్చినట్టు స్పష్టమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉన్నాయి. డానియల్ శేఖర్ లోని అహంకారం, భీమ్లా నాయక్ పాత్రలోని ఆత్మాభిమానం.. ఈ సినిమాని విజయపథంలో నడిపాయని చెప్పవచ్చు. ఇద్దరి మధ్యా జరిగే పోరాట సన్నివేశాలు కూడా రసవత్తరంగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్ప మొత్తం మీద పవర్ స్టార్ స్టామినాకు నిలువెత్తు నిదర్శనంగా భీమ్లానాయక్ ను చెప్పవచ్చు.
నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రఖని, బ్రహ్మానందం, మురళీ శర్మ, రావు రమేశ్, రఘుబాబు తదితరులు.
సాంకేతిక వర్గం: సంగీతం: తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, ఎడిటింగ్: నవీన్ నూలి, స్క్రీన్ ప్లే – మాటలు: త్రివిక్రమ్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
విడుదల తేదీ: 25-02-2022
ఒక్క మాటలో: పవన్ తుపాను
రేటింగ్: 3.25/5