త్రికరణశుద్ధిగా అనే పదానికి మనసా వాచా కర్మేణా.. అనే అర్థం చెప్తారు పెద్దలు. ఆ ప్రకారంగా చూసినట్లయితే.. తెలంగాణ రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి, గులాబీ దళపతికి ప్రియమైన తనయుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు.. త్వరలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి ద్వికరణ శుద్ధిగా సంసిద్ధం అవుతున్నారు. సీఎం పట్టాభిషేకానికి ముందస్తు సన్నాహాలను ఆయన అనుయాయుల స్తోత్రకీర్తనల సాక్షిగా హాయిగా ఆస్వాదిస్తున్నారు.
కేటీఆర్- జరగబోయే పట్టాభిషేకానికి సంబంధించిన మధురోహల అనుభూతుల్లో తేలియాడుతున్నారు. ఈ విషయంలో ఇక ఎలాంటి సందిగ్ధావస్థలకు ఆస్కారం లేదు. ఆచార సాంప్రదాయాలు, శుభాశుభ ముహూర్తాల విషయంలో చాలా పట్టింపులు ఉన్న సదాచార పరాయణుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అధికారికంగా ముహూర్తం ప్రకటించడం ఒక్కటే తరువాయి! తతిమ్మా అంతా పూర్తయినట్టే!
ఇందులో కొత్త సంగతి ఏమీ లేదు..
తెలంగాణ స్వప్నం సాకారం అయితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని.. రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి.. వారి ప్రేమాభిమానాలను ఓట్లరూపంలో కొల్లగొట్టిన నాయకుడు కేసీఆర్. నిజానికి రాష్ట్రం ఏర్పడిన తొలి సందర్భంలో.. తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టిన ప్రజలు.. ‘దళితుడిని సీఎం చేస్తా’నన్న ఆయన వాగ్దానం ఎలా మంటగలిసిపోయిందో అస్సలు పట్టించుకోలేదు. దళితుడిని సీఎం చేస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకుంటాడేమోనని ఆశపడి, కొందరు దళిత నాయకులు ఉన్న పార్టీలను విడిచిపెట్టి.. గులాబీతీర్థం పుచ్చుకున్నారు. అలాంటి వారు.. ‘తొలి రెండు మూడేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. పాలన వ్యవహారాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత.. ముఖ్యమంత్రి పీఠాన్ని దళితుడికి అప్పగిస్తారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అలాంటి ఆశలున్న వారే.. ఆ ప్రచారం చేశారని అనుకోవచ్చు. అలాంటి వారు కొన్నేళ్లు సీఎం పదవి వరమాల రూపంలో వచ్చి మెళ్లో పడుతుందని ఎదురుచూసి.. కళ్లు కాయలు కాచి వాళ్లే వేరే పార్టీలను వెతుక్కుని అటువైపు వెళ్లారు. అంతే తప్ప.. కేసీఆర్ చెప్పిన మాటను జనం అంతా కన్వీనియెంట్‌గా మర్చిపోయారు.
2018లో అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిగాయి. దళితుడికి పదవి దక్కాలి కదా అనే వాదన మరుగున పడిపోయింది. క్రమంగా కేసీఆర్ వారసుడు ఎవరు? అనే చర్చ ప్రారంభమైంది. మామూలుగా అయితే.. మన భారతీయ రాజకీయ పార్టీల వ్యవహారసరళి ప్రకారం కేసీఆర్ వారసత్వం ఆటోమేటిగ్గా కొడుకు కేటీఆర్‌కు దక్కుతుందే తప్ప.. మరొకరికి దక్కేది కాదని ఎవరైనా అనుకుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా కేటీఆర్ స్థాయిలోనే మంత్రిగా ఉండడం, పైగా రాష్ట్ర సాధన ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొన్న నాయకుడు కావడం, ప్రజాదరణలో కేసీఆర్‌ను మించిన మెజారిటీలు సాధించిన వ్యక్తి కావడం, అదే సమయంలో- పార్టీ శ్రేణుల్లో, నాయకత్వంలో అపరిమితమైన పట్టుఉన్న వ్యక్తి కావడం.. లాంటి సమీకరణలన్నీ అందరి మెదళ్లలో ఉండడం వల్ల మాత్రమే.. ‘వారసత్వం ఎవరిది’ అనే చర్చ సాగింది. హరీష్ ఎంత బలమైన నాయకుడు అయినప్పటికీ.. ఆయన నొచ్చుకునే అవకాశం లేకుండా, ఆయన నొచ్చుకుంటే పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేలా.. ‘వారసుడు కేటీఆరే’ అనే సంగతిని ప్రచారంలో పెట్టడానికి అందరూ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఒక సందర్భంలో కల్వకుంట్ల కవిత ఓ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా.. ‘అసలు ఆ చర్చ ఎందుకు వారసత్వం కేటీఆర్‌దే’ అంటూ కుండబద్ధలు కొట్టారు. హరీష్ రావు- ‘వారసత్వం అనే ప్రశ్నే ఉదయించదు.. కేసీఆరే ఎప్పటికీ మా నాయకుడు’ అంటూ నర్మగర్భోపాఖ్యానాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఈ రోజులన్నీ గతం! ఇప్పుడు అలాంటి చర్చోపచర్చలకు ఆస్కారమే లేదు. వారసుడు కేటీఆర్ మాత్రమే అని అందరూ ఫిక్సయిపోయి ఉన్నారు. అయితే ఏదో కన్నకొడుకు గనుక.. పట్టాభిషేకం చేసినట్లుగా బయటకు కనిపించకుండా.. కేటీఆర్ అపరిమిత ప్రతిభాపాటవాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసి.. ఆ తర్వాత.. సీఎం పదవి అప్పగించాలనేది గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అందుకు ఉపయోగించుకోవచ్చునని అనుకున్నారు. ఇదివరకటి తరహాలోనే.. దుబ్బాకను పూర్తిగా అల్లుడు హరీష్ కు అప్పగించి.. అక్కడ వైఫల్యం బట్టబయలైన తర్వాత.. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని అచ్చంగా కేటీఆర్ కు అప్పగించారు. ఇక్కడ అప్రతిహత విజయం దక్కి ఉంటే గనుక.. నిర్ద్వంద్వంగా హరీష్ కంటె సమర్థుడైన నాయకుడిగా కేటీఆర్‌కు గుర్తింపు దక్కి ఉండేది. కానీ.. ఆ పాచిక పారలేదు. జీహెచ్ఎంసీలో కూడా పరాభవం తప్పలేదు. ‘పట్టాభిషేకం’ ముహూర్తాన్ని అనివార్యంగా కొంత వెనక్కు నెట్టవలసి వచ్చింది.
Mus Read ;- కేటీఆర్ సీఎం?.. గ్రౌండ్ లెవెల్ కూడా ప్రిపేర్
మారిన వాతావరణం
ముఖ్యమంత్రి కేసీఆర్ సపత్నీకంగా కాళేశ్వరం వెళ్లి ఆలయంలో పూజలు నిర్వహించి, నదీమతల్లికి పుష్పార్చన గావించి.. వస్తే.. ‘అదంతా కొడుకును సీఎం చేయడానికి చేసిన యాగం తర్వాత.. అక్కడి పూలను నదిలో వేయడానికి మాత్రమే చేసిన పర్యటన’గా భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ అభివర్ణించారు. అందుకే దంపతులు ఇద్దరూ వెళ్లారని ఆయన భాష్యం చెప్పారు. బండి సంజయ్ చెప్పినప్పుడు అది అతిశయోక్తిగా అనిపించింది గానీ.. ‘ఆ మాటలు ఎందుకు నిజమై ఉండకూడదు?’ అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.
కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం కొన్ని నెలలుగా ముమ్మరంగా జరుగుతోంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఎటొచ్చీ.. ఏదో ఒక నాటికి ఆయనే అభిషిక్తుడౌతాడు గనుక.. ముందునుంచే స్తోత్రాలు వల్లెవేసి కాసింత ప్రసన్నం చేసుకుంటే పడుంటుంది అనేది వారి ఆలోచన అయి ఉండొచ్చు. అందుకే- వీరందరి మాటలు ఒక ఎత్తు. వారసత్వం, పట్టాభిషేకం అంచనాలు మరింత ఘాటుచర్చకు మళ్లేలా.. మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. ముఖ్యమంత్రి కాబోతున్నాడని అందరూ అంటోంటే.. ఆల్రెడీ.. కేటీఆర్ సాంతం ముఖ్యమంత్రి పనులే చేస్తున్నారన్నట్లుగా ఈటెల మాటలు ధ్వనించాయి.
నెలకిందట మొదలైన చర్చ
నిజానికి కేటీఆర్ త్వరలోనే సీఎం కాబోతున్నారనే చర్చ సుమారు నెలకిందట ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్థానికంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే మూడునెలల్లో మార్చిలోగా కేటీఆర్ సీఎం అవుతున్నారని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత.. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు షకీల్, బాజిరెడ్డి, మెతుకు ఆనంద్, మంత్రులు తలసాని, కొప్పుల ఈశ్వర్ ఇదే మాట అంటున్నారు. వీరందరూ ఎలాంటి సంకేతాలూ లేకుండా పుకార్లను అధికారికంగా ప్రచారంలో పెడుతున్నారని అనుకోవడానికి వీల్లేదు. వీళ్లందరినీ మించి.. ఒకప్పట్లో హరీష్ రావు వర్గానికి చెందిన కీలక నాయకుడిగా పేరున్న ఈటల రాజేందర్ కూడా అలాంటి మాటలు అనడం విశేషం.
Also Read ;- కేసీఆర్‌కూ.. PK సహాయం కావాల్సిందేనా..!
వీరంతా వేరు.. పద్మారావు వేరు..
ఈ మాట ఎందరు చెప్పినప్పటికీ.. వారంతా తమ తమ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చారు. కానీ.. కేటీఆర్ సమక్షంలోనే ఆయన పక్క కుర్చీలో ఉండగా.. ఆ కార్యక్రమంలో ఈ మాట చెప్పడం డిప్యూటీ స్పీకరు పద్మారావు గౌడ్ కే చెల్లింది. గురువారం నాటి కార్యక్రమంలో కేటీఆర్ తో కలిసి సికింద్రాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న పద్మారావు.. కేటీఆర్ మన కాబోయే సీఎం అని ప్రకటించారు.
ఆ సమయానికి కేటీఆర్ పక్కనే ఉన్నారు. సగానికి పైగా మొహాన్ని కప్పేసినట్లుగా ఉండే, పోచంపల్లి డిజైన్లు గల ఆయన మాస్క్ మాటున ముసిముసి నవ్వులు దాగి ఉన్నాయేమో, మరే ఇతర భావనలు ఎవ్వరికీ తెలియదు. కేటీఆర్ మాత్రం ఆ మాటలను మౌనంగానే ఆలకించారు. ‘అతి త్వరలో కాబోయే సీఎం’కు తన తరఫున.. రైల్వే కార్మికుల తరఫున కూడా పద్మారావు గౌడ్ శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. కేటీఆర్ సమక్షంలోనే ఆయనను ముఖ్యమంత్రిగా స్తుతించడం ఇదే ప్రథమం. దీంతో ఈ పుకార్లకు పద్మారావు గౌడ్ అనధికారికంగా- అధికారిక ముద్ర వేసినట్లు అయింది.
ఈ వెల్లువ పెరుగుతుంది..
కేసీఆర్ ఆశ్రితులుగా, ఆయన దయాపాత్రమైన పదవులను కాపాడుకోవడమే పరమావధిగా భావించే తెరాస నాయకులు తీరు చూస్తే ఎలా కనిపిస్తున్నదంటే.. ‘కేటీఆర్ కాబోయే సీఎం అని అందరూ అనేస్తున్నారు.. మనం కూడా ఆ మాట అనకపోతే వెనకపడిపోతామేమో’ అని వారిలో కంగారు కలుగుతున్నట్టుంది. అందుకే అందరూ పనిగట్టుకుని ‘కేటీఆర్ కాబోయే సీఎం’ అని ప్రకటనలు గుప్పిస్తున్నట్టుంది. ఇదే నిజమైతే రాబోయే రెండు మూడు రోజుల్లో.. దాదాపుగా ప్రతి తెరాస నాయకుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. కేటీఆర్ ను కీర్తించడంలో.. ఆయనను ముఖ్యమంత్రిగా పరిగణించడంలో తమ తమ చొరవను ప్రదర్శిస్తారు. ప్రకటనల వెల్లువ పెరుగుతుంది.
పద్మరావు ప్రసంగం సాక్షిగా- కేటీఆర్ తీరు గమనిస్తే.. తొలుత చెప్పినట్లు.. ఆయన సీఎంగా పట్టాభిషేకానికి ద్వికరణశుద్ధిగా సిద్ధమవుతున్నట్టే ఉంది. వాచా- అంటే నోటితో కేటీఆర్ ఈ విషయం గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు గానీ.. మనసా, కర్మేణా ఆయన సీఎం సింహాసనం అధిష్టించబోయే ప్రచారాన్ని ఆస్వాదిస్తున్నారని అనిపిస్తోంది.
Also Read ;- కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారా?
.. సురేష్ పిళ్లె