రేషన్ బియ్యం పంపిణీ పథకంపై మంత్రులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. వికలాంగులు, వృద్ధులకు ఇళ్ల వద్దే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన వారికి రేషన్ దుకాణాల ద్వారానే ఇకపై బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. బియ్యం ఇచ్చే రోజు తప్ప రేషన్ వాహనాలతో పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఇక రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెడితే ఎలా ఉంటుందని మంత్రి వర్గ సభ్యులను అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
వాహనాల ద్వారా రేషన్ సరఫరాతో స్మగ్లింగ్‌కు అవకాశం ఉందన్నారు. దీంతో పథకం ఉద్దేశం నీరుగారిపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుకాణంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబుతో చెప్పారు. రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశ పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు.
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగింది. జగన్ హయాంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన కూటమి సర్కార్….దీనిపై గతంలోనే సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ అధిపతిగా ఈగల్ విభాగాధిపతి ఆకె రవికృష్ణకు బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గతంలోనే బియ్యం అక్రమ రవాణాపై 13 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్. ఈ పథకంలోనూ సిలిండర్ల బుకింగ్‌తో సంబంధం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదికి ఒకసారి నగదు జమ చేయాలని నిర్ణయించింది.
రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెడితే… ఏపీ ఖజానాకి పడే చిల్లు బాగా తగ్గిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు అధికారులు.. బియ్యం సరఫరా, వాటి సేకరణ, పంపిణీకి వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది.. నగదు బదిలీ చేస్తే దీనిలో కొంత భాగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.. అందుకే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.. ఈ నిధులని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించవచ్చని లెక్కలు కడుతున్నారు.. మరి, ఈ సంస్కరణ అమలులోకి వస్తే ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో అనేది ఆసక్తికరంగా మారింది..











