1840 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడ పిల్లలు, మహిళల విషయంలో ఉండే సాంఘిక దురాచారాల గురించి ఎన్నో చదివాం. అప్పట్లో ఆడపిల్ల, మహిళలు బయటకు వెళ్లడమే గగనం..సామాజిక కట్టుబాట్లు కూడా అలాగే ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఓ 15ఏళ్ల వయస్సు బాలిక ఏకంగా ఓ పాఠశాల ప్రారంభించారు. బడుగు, బలహీన వర్గాల కోసం భర్త సహకారంతో ఈ ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు…అయినా లక్ష్యం వీడలేదు. ఆధునిక భారత మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా కీర్తి పొందారు. ఆ బాలిక ఎవరో రాదు.. సావిత్రీ భాయి పూలె.
ఆడపిల్లలకు చదువు, ఆడపిల్లకు ఆర్థిక స్వావలంభన విషయంలో సామాజిక చైత్యన్యం తెచ్చినవారిలో ముందు వరుసలో నిలిచారు సావిత్రీ భాయి పూలె. వెస్ట్ మహారాష్ట్రలో (ప్రస్తుత సతారా జిల్లా) ని నయగావ్ అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3న సావిత్రి భాయి పుట్టారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం 9ఏళ్లకే జ్యోతిరావు పూలెతో వివాహమైంది. అప్పటికే వివక్ష, సాంఘిక దురాచాలపై పోరాడేందుకు జ్యోతిరావు పూలె సిద్ధమయ్యారు. వివాహమైన తరువాత సావిత్రా భాయి పూలె ఆలోచనలు తెలుసుకున్న జ్యోతిరావు పూలె అన్ని విధాలుగా సావిత్రికి తోడుగా నిలిచారు. మహిళలందరికీ సంపూర్ణ సమాన హక్కులు కేవలం విద్యతోనే సాధ్యమని నినదించారు. బాలికల కోసం స్కూల్స్ ప్రారంభించాలని పూలే దంపతులు నిర్ణయించుకున్నారు.
1847లో బాలికల ప్రత్యేక పాఠశాలకు అంకురార్పణ
1847లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలకు అంకురార్పణ చేశారు. 1848లో పూర్తయింది.తొమ్మిది మంది విద్యార్థులతో మొదలైన స్కూల్‌కి సావిత్రీభాయి పూలె ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించారు. అయితే ఆరు నెలల తరువాత మూత పడింది. వేరే చోటికి మార్చాల్సి వచ్చింది. అప్పట్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, వేధింపులు ఎక్కువయ్యాయి. సావిత్రిభాయి స్కూల్‌కు వెళుతుంటే ప్రతిరోజూ ఏదో ఒక ఆటంకం కల్పించేవారు. వాటికి తట్టుకుని మరీ స్కూల్‌కి వెళ్లేవారు సావిత్రీభాయి. “ నా ధర్మం ఇది. నేను నెరవేరుస్తున్నాను. దైవం నాకు తోడుటుంది. మిమ్మల్ని కూడా క్షమించి ఆశీర్వదిస్తాడు ’ అని బదులిచ్చే సావిత్రీభాయి క్రమేణా ఆ వ్యతిరేకతను తగ్గించగలిగారు. ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి తన ఇంటిని సావిత్రీ భాయి స్కూల్‌కి ఉచితంగా ఇవ్వగా, చాలా మంది పుస్తకాలు సేకరించి పాఠశాలకు ఇవ్వడంతో పాఠశాలకు అవాంతరాలు తొలిగాయి. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖుల తోడ్పాటు కూడా లభించింది. తమకు పిల్లలు లేకపోవడంతో యశ్వంతరావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు సావిత్రీభాయి పూలె దంపతులు. నాలుగేళ్లలో 20శాఖలుగా ఉచిత విద్యాబోధన లక్ష్యంగా పాఠశాలల విస్తరణ జరిగింది. ఆ దంపతుల హయాంలో మొత్తం 52 శాఖలు ఏర్పాటయ్యాయి. తరువాతి కాంలో 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. సాంఘిక దురాచాలపై పోరాటానికి 1873లో తన భర్త మహత్మా పూలేతో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించారు. బాల్య వివాహలకు, మూఢ నమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునఃర్వివాహల కోసం పోరాడారు. 1870, 1890వ దశకాల్లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు 2వేల మంది అనాధ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. సావిత్రిభాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 1854లోనే ఆమె తన అభిప్రాయాలతో రాసిన ‘కావ్యఫూలే’ పుస్తకం ప్రచురితమైంది. 1891లో ‘పావన కాశీ సుభోధ్ రత్నాకర్’ను ప్రచురించారు.
అదే వ్యాధికి బలై..
అప్పటికే దేశ వ్యాప్తంగా సావిత్రీభాయి పూలె, జ్యోతిరావు పూలె సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే 1890 నవంబరు 28న జ్యోతీరావు పూలె అనారోగ్యంతో మరణించారు. అయితే కన్నీటిని దిగమింగుతూనే.. కొత్త సంస్కరణకు తెర దీశారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపి చరిత్రలో నిలిచారు. తరువాత ఏడేళ్లకు 1897లో పూణెలో ప్లేగు మహమ్మారి వ్యాపించింది. నగరంలో మరణాలు ఎక్కువవుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రజలు నగరం విడిచి వెళ్లిపోతున్నారు. వ్యాధి గ్రస్తులకు సేవ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి తలెత్తింది. అయినా సావిత్రీ భాయి తన కుమారుడు యశ్వంత్‌తో కల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. ఓవైపు దుర్భిక్షం, మరో వైపు ప్లేగు వ్యాధిని ఎదుర్కొనేందుకు నిరంతరం పొరాడుతూనే వచ్చారు. ఆ క్రమంలోనే దేశ ప్రజలు ఓ దుర్వార్త వినాల్సి వచ్చింది. మార్చి 10, 1897లో ప్లేగు వ్యాధితోనే సావిత్రీభాయి చనిపోయారు.
1997లో తపాలా స్టాంపు విడుదల
ఆమె చేసిన సేవలకు గుర్తుగా 1997లో భారత ప్రభుత్వం సావిత్రిభాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు. సావిత్రీభాయి చేసిన సేవలు ఆదర్శంగా తీసుకుని అప్పటి భారత ఉపఖండంతో చాలా మంది సాంఘిక దురాచారాలపై పోరాటం సాగించారు. డాక్టర్ ఆనంది బాయి ఘోష్, పండిత రామాబాయి, తారాబాయి షిండే, రమాబాయి రనాడే వంటి వారిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలకే తన జీవితాన్ని అంకింతం చేసిన సావిత్రీభాయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. దేశ మొట్టమొదటి దేశీయ పాఠశాలలో అమలైన విధానాలే..తరువాత విద్యా సంస్కరణలకు మార్గదర్శకాలుగా మారాయి.