‘దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్’ అంటూ శతాబ్దం కిందట చాటిచెప్పిన కవిశేఖరుడు , అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు నేటి తరానికి ఆదర్శప్రాయుడు.
1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించిన గురజాడ బాల్యంలోనే తల్లిదండ్రులతో కలసి విజయనగరం చేరుకున్నారు. ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డారు. యుక్త వయస్సు వచ్చేసరికి రచయిత, సంఘసంస్కర్త, హేతువాది, అభ్యుదయకవిగా పేరుగాంచారు.
ఆనాటి సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను రూపుమాపేందుకు, ప్రజలను చైతన్యపరచేందుకు తన రచనల ద్వారా అవిరళ కృషిచేసి నవయుగ వైతాళికుడుగా పేరుగాంచారు.
సజీవం కన్యాశుల్కం
ఆనాటి సమాజంలో అత్యంత హేయంగా శుల్కం చెల్లించి వృద్ధులు కన్యలను వివాహమాడుతున్న తీరును ఎండగొడుతూ ‘కన్యాశుల్కం’ నాటకం రచించి ప్రజామన్ననలను పొందారు. ఆ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి , రామప్పపంతులు, లుబ్ధావధానులు తదితర పాత్రలు నాటి సామాజిక పోకడలకు, రుగ్మతలకు సజీవసాక్షాలుగా నిలిచాయి. ఆయన ఈ లోకాన్ని విడిచి (1915, నవంబర్ 30) వందేళ్లు పూర్తి అయినప్పటికీ ఆ నాటకం నేటికీ ఏదో ఒక చోట ప్రదర్శిస్తుండటం, గురజాడ సామాజిక స్పృహకు ఉన్న సార్వకాలీనతకు నిదర్శనం, ఆయన ఔన్యాత్యానికి నిదర్శనం.
జీవభాషలో రచనలు
గురజాడ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించి నేటితరానికి అడుగుజాడగా నిలిచారు. నాటి నేటి తరం ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో రచనలు చేసి తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అతిగొప్ప సాహితీకారుడుగా పేరుగాంచారు. తెలుగు సాహిత్యంలో వాడుకభాషను జొప్పించేందుకు కృషి చేసినవారిలో ముఖ్యునిగా పేరొందారు. ‘తిండి కలిగితే కండ కలదోయ్ .. కండ కలవాడె మనిషోయ్’ అంటూ ఆ నాటి సమాజ పరిస్థితులను , ప్రజల కర్తవ్యాన్ని గుర్తుచేసిన అభ్యుదయ వాది గురజాడ ఆశయ సాధనకు నేటితరం నిరంతర కృషి చేయాల్సిన అవసరముంది.
హామీల అమలే నిజమైన నివాళి
గురజాడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా నిర్వహిస్తూ, వర్థంతి రోజున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆర్భాటంగా హామీలిచ్చి తరువాత వాటిని పక్కన పెడుతున్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో వాటిని అమలు చేయాలి. నేటి యువతరంలో స్ఫూర్తి నింపాలి. అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతాం.