విశాఖపట్నంలోని శారదాపీఠం స్వామి స్వరూపానందకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వేడికోళ్లు వెళుతున్నాయి. తిరుమల డిక్లరేనషన్ వ్యవహారాన్ని కెలుక్కున్నందుకు ఇప్పుడు తమ మర్యాద కాపాడుకోవాలంటే ఆయన జోక్యం చేసుకోవాలని వారు ఆశిస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి అన్యమతస్థులు ప్రవేశించాలంటే, స్వామివారిని దర్శించుకోవాలంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ జగన్ ఇవ్వనక్కర్లేదని, జగన్ గరుడసేవ రోజు తిరుమల వస్తున్నారు గనుక.. ఆయనకు డిక్లరేషన్ ఇబ్బంది లేకుండా, మొత్తం ఆ నిబంధననే తొలగించేయాలని అనుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ వర్గాలు తేనెతుట్టెను కదిపాయి.
జగన్మోహన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకోవడానికి సదా ఆరాటపడుతూ ఉండే వైసీపీ నాయకులు- తిరుమల డిక్లరేషన్ పద్ధతిని వ్యతిరేకించడం అనేది ఒక సులువైన మార్గంగా ఎంచుకున్నారు. ఎడాపెడా దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేస్తున్నారు. మంత్రి కొడాలి నాని మాటలు దానికి పరాకాష్ట. ఆ నిబంధన ఎవరు పెట్టారు? ఎవరిని అడిగి పెట్టారు? అంటూ ఆయన ప్రశ్నించడం… మత మార్పిడులకు ముడిపెట్టడం ఇదంతా పెద్ద వివాదం అయింది. హిందువుల్లో, ప్రధానంగా ఆ భావన మెండుగా ఉండే వారిలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
అయితే ఇప్పుడు డిక్లరేషన్ విషయంలో తాము చెబుతున్నది తప్పు కాదని, ఆ ఏర్పాటు ఉండకూదని వైసీపీ నాయకులు మాట్లాడినంత కాలం.. పార్టీకి నష్టమేనని.. బయటి వారితో ఆ విషయంపై మాట్లాడిస్తే కాస్త లాభం ఉండచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హిందూ మత పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలతో తమ వాదనకు అనుకూలంగా మాట్లాడించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఆ క్రమంలో భాగంగానే విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందను ఆశ్రయిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
స్వరూపానంద వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడు. జగన్ మీద పుష్కలంగా ప్రేమాభిమానాలు ఉన్న ఆధ్యాత్మికవేత్త. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు భక్తుడు. ఇదే స్వరూపానంద- వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం కోసం గతంలో రాజశ్యామల యాగం చేసినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. జగన్ పలుమార్లు ఆయనను కలిసి ఆశీస్సులు అందుకోవడం కూడా జరిగింది. ఈ అనుబంధంతో- తిరుమల డిక్లరేషన్ వివాదంలోకి స్వరూపానందను తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
కర్ణాకర్ణిగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి…
తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ పద్ధతి తప్పు అని.. దానివల్ల మనుషులను వేరు చేసి చూసినట్లు అవుతుందని, అది మానవత్వం కాదని, మానవత్వమే కాకుండా దైవత్వం ఎలా ఉంటుందని అనే తరహాలో స్వరూపానంద ద్వారా చెప్పించడానికని పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. హిందూ మతానికి ప్రతినిధులుగా వ్యవహారంలో ఉన్న పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలతో ఈ విషయం చెప్పిస్తే.. తమ పట్ల వచ్చే వ్యతిరేకత తగ్గుతుందని వారి ఆశగా ఉంది.
స్వరూపానంద మాత్రమే కాకుండా, తమకు అనుకూలురైన ఇతర స్వాములు, మత పెద్దలను కూడా ఆశ్రయించి వారందరితో కూడా ఇలా చెప్పించాలనే ఆలోచన చేస్తున్నారు. పార్టీ అడిగినంత మాత్రాన.. ఐహికవిషయాలను త్యజించి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఇలాంటి స్వాములు.. ఈ టాపిక్ పై మాట్లాడతారా? డిక్లరేషన్ అక్కర్లేదు.. టీటీడీ అనుసరిస్తున్న విధానాలు తప్పు అని వ్యాఖ్యానించి తమ ఇమేజిని కూడా ప్రమాదంలోకి నెట్టుకుంటారా? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. మొత్తానికి సింపుల్ గా పోతుందనుకున్న డిక్లరేషన్ గొడవ.. వైసీపీ మెడకు గట్టిగానే చుట్టుకుంది. ఎలా దాన్నుంచి బయటపడతారో చూడాలి.











