ఏపీలో రాజకీయం కేవలం రోజుల వ్యవధిలోనే రివర్స్ అయింది.. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి సీఎంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సీన్ మారిపోయింది.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైపోయింది. బీజేపీకి చెందిన అగ్ర నేతలంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో ఏపీలో కలిసి ప్రచారంలో పాలుపంచుకున్నారు. వారి వ్యూహాలు ఫలించి… ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అటు కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది.
గతంలో సోలోగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమలనాధులు.. ఈ సారి కూటమి ప్రభుత్వాన్ని తెరముందుకు తెచ్చారు.. గత రెండు పర్యాయాలు సాధించినంత మెజారిటీ మొన్నటి ఎన్నికలలో బీజేపీకి సాధ్యం కాకపోవడంతో టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారిపోయింది. ఈ పరిణామం… చంద్రబాబుకు జాతీయ స్థాయి రాజకీయాల్లో మరింత మేర వెయిట్ పెంచగా… అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న జగన్ లో అంతకంతకూ బీపీని పెంచేస్తోంది.
ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలే ఉన్నా… ఆ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీగా టీడీపీ కొనసాగుతోంది. ఏపీలో మొత్తంగా 16 ఎంపీ సీట్లను గెలిచిన టీడీపీ… జనసేన, బీజేపీలు చెరో 2 ఎంపీ సీట్లను గెలిచేలా వ్యూహాలు రచించి ఫలితం సాధించింది. ఫలితంగా ఇప్పుడు చంద్రబాబుకు ఢిల్లీలో పలుకుబడి బాగా పెరిగిపోయింది. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా… ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇట్టే దొరికిపోతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీకి కూడా చంద్రబాబు అసలు ఆగాల్సిన పనే లేకుండాపోయింది.
ఇక ఇతర కేంద్ర మంత్రులతో భేటీల కోసం చంద్రబాబుకు అపాయింట్ మెంట్లు కూడా అవసరం లేనట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రధాని మోదీతో భేటీ తర్వాత చంద్రబాబు వరుసబెట్టి కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రులతో ఈ మేర రాసుకుపూసుకుని తిరగడమంటే… ఎన్డీఏలో చంద్రబాబు వెయిట్ అమాంతం పెరిగిపోయిందని చెప్పక ప్పదు. అంతేనా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో… నడ్డాకు ఓ వైపున మోదీ, మరోవైపున చంద్రబాబు ఆసీనులయ్యారు. ఈ విజువల్స్ చూసినంతనే… ఎన్డీఏలో చంద్రబాబు పరపతి ఓ రేంజికి పెరిగిపోయిందని చెప్పక తప్పదు.
ఇక ఎన్డీఏ రథసారధిగా ఉన్న బీజేపీతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన పార్టీల నేతలంతా చంద్రబాబుకు ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు. నిన్నటి ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల భేటీలో ఈ విషయం చాలా స్పష్టంగానే కనిపించింది. బీజేపీతో పాటుగా ఇతర పార్టీలు కూడా చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్న తీరు ఇందుకు నిదర్శనం. మోదీని రిసీవ్ చేసుకున్న తరహాలోనే చంద్రబాబును కూడా ఆయా పార్టీ నేతలు రిసీవ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా… అటల్ బిహారీ వాజ్ పేయికి నివాళి అర్పించే సమయంలోనే బీజేపీ నేతలు చంద్రబాబుకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా స్పష్టంగానే కనిపించింది. మొత్తంగా హస్తినలో చంద్రబాబు పరపతి ఇట్టే పెరిగిపోయింది.
ఈ పరిణామం నిజంగానే జగన్ ను హడలెత్తిస్తోందని చెప్పక తప్పదు. ఎందుకంటే… తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకున్నారంటూ సీబీఐతో పాటు ఈడీ కూడా జగన్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లోనే అరెస్టై 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్… ప్రస్తుతం ఈ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. చంద్రబాబు తన పరపరితి వినియోగించి ఎక్కడ తన బెయిల్ రద్దు చేయిస్తారోనన్న భయం జగన్ ను వెంటాడుతోందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.











