వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తాజాగా తిరుపతిలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన చాలా మంది నేతలతో పాటు నగరి ఎమ్మెల్యేగానే కాకుండా… జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగానూ పనిచేసిన ఆర్కే రోజా కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో భూమన సహా ఇతర నేతలంతా ప్రసంగించినా రాని ఊపు రోజా ప్రసంగంతో వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రోజా ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని అయితే నింపి ఉండొచ్చు గానీ… జగన్ సీఎంగా ఉండగా,… అందిన కాడికి దండుకున్న నేతలు మాత్రం ఆమె ప్రసంగానికి ఠారెత్తిపోయారట. విపక్షంలో ఉన్నామన్న భావనే లేకుండా… అదేదో తాము అధికారంలో ఉన్నప్పుడు అసలు అవినీతికే పాల్పడలేదన్నట్లుగా రోజా మాట్లాడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించిందనే చెప్పాలి. ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా భారీ ఎత్తున వెనకేసుకున్నారన్న వాాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై కూటమి సర్కారు దృష్టి పెడితే… రోజా అడ్డంగా బుక్ కావడం ఖాయమేనని చెప్పాలి. మరి ఏ ధైర్యంతో రోజా కూటమి సర్కారుకే సవాళ్లు విసురుతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయినా గురువారం నాటి తిరుపతి సమావేశంలో రోజా ఏమన్నారన్న విషయానికి వస్తే… కూటమి సర్కారు వైసీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తోందని ఆమె మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేస్తారేమో చేసుకోండిఅంటూ ఆమె సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలని రోజా సవాల్ విసిరారు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారా?… పెట్టుకోండి అంటూ ఆమె మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పిన రోజా… ఈ రోజు తమను అరెస్ట్ చేస్తే… రేపు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె ఘాటు వ్యాఖ్యలే స్పందించారు.
రోజా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆమె పక్కగానే కూర్చుని ఉన్న భూమన బెదిరే కళ్లతో ఆమెను చూసిన వైనం… రోజా వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఏ రీతిన భయపెట్టాయన్న విషయాన్ని కళ్లకు కట్టింది. అసలే ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలను కూటమి సర్కారు బుక్ చేసి పారేసింది.వీరిలో కొందరు జైలులో ఉంటే… మరికొందరు ముందస్తు బెయిల్ లతో బయట ఉన్నారు. మరికొందరు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రోజా ఇలాంటి సవాళ్లు చేసి కూటమి సర్కారుకు ఆగ్రహం తెప్పించడం ఎందుకు అన్నది భూమన అండ్ కోల వాదనగా తెలుస్తోంది. అసలే కాక మీద ఉన్న కూటమి సర్కారు రోజా మాటలు విని తమపై పడితే తమ పరిస్థితి ఏం కాను అని వారు బెంబేలెత్తిపోతున్నారు.
ఇక ఇతర నేతల గురించి అలా పక్కనపెడితే… రోొజా అవినీతిపైనే లెక్కలేనన్ని ఆరోపణలు వినిపించాయి. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన వెంటనే కుమారుడి కోసమంటూ ఆమె కొనుగోలు చేసిన ఖరీదైన కారును చూసి జనం విస్తుపోయారు. మంత్రిగా ప్రమాణం చేస్తేనే ఈ మేర కారు కొంటే…ఇక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే.. రోజా ఇంకెంత మేర మేస్తారోనని కూడా సెటైర్లు వినిపించాయి. జనం అనుమానపడినట్లుగానే మంత్రి హోదాలో రోజా ఓ రేంజిలో చేతివాటం ప్రదర్శించినట్లుగా సమాచారం.
ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ప్రతి వారం తిరుమల వెంకన్న దర్శనానికి వెళుతూ.. ప్రతిసారీ తన వెంట ఓ 50 మందిని తీసుకుని వెళ్లి.. స్వామి వారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని రోజాపై ఆరోపణలున్నాయి. మంత్రి హోదాలోనూ ఆమె ఈ దందాను నిరాటంకంగా కొనసాగించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపడితే కూడా రోజా దొరికిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఇక పర్యాటక శాఖలో ఆమె సాగించిన వ్యవహారాలపై విచారణ చేపట్టినా… ఆమె అడ్డంగా దొరికపోవడం ఖాయమేనని… ఇలాంటప్పుడు సర్కారును ఉసిగొలిపే యత్నం చేయడం ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి











