రాజకీయ పార్టీలు, అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలకు మిగిలింది ఒక్క రోజే ఉండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపెవరిది?.. కారు తన స్పీడ్‌ను కంటిన్యూ చేయనుందా? కాషాయం జెండా ఈ సారి గ్రేటర్లో ఎగరనుందా?… కాంగ్రెస్ పార్టీ హస్తానికున్న పవరెంత? ఓల్డ్‌సిటీలో ఎంఐఎం హవా ఎంత?.. అని గ్రేటర్ ఎన్నికల వార్‌లో ఎవరెన్ని సీట్లు గెలవబోతున్నారు. ఇలా ఎవరకి వారు తమ విజయావకాశాలపై రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.
వంద పక్కానా?…
పోలింగ్ సరళిని బట్టి విజయం తమదంటే.. తమదని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. లెక్కలే కాదు ఈ సారి మేయర్ పీఠంపై తమ జెండానే ఎగురబోతుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాయి. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికలల్లో టీఆర్ఎస్ పార్టీ 150 చోట్ల తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. అయితే ఈసారి 100 డివిజన్లలో కచ్చితంగా గెలిచి తీరుతామనే అంచనాలను ఆ పార్టీ నేతలు వేసుకుంటున్నారు. నమోదైన పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. అక్కడక్కడ తప్పితే చాలా డివిజన్లలో కారు స్పీడుకు అడ్డే ఉండదని భావిస్తున్నారు గులాబీ నేతలు.
మెజార్టీ తమదే అంటున్న కమలనాథులు..
ఇదిలా ఉంటే బీజేపీ ఈసారి ఈ గ్రేటర్ ఎన్నికల్లో చాలా ఆశలే పెట్టుకుంది. అదేస్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీకూడా ఇచ్చే అవకాశం ఉంది. చాలా చోట్ల కారు స్పీడ్‌కు కమలం బ్రేకులు వేస్తుందని.. వార్ వన్‌సైడే అవుతుందనే ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ లెక్కలు టీఆర్ఎస్కు ఉంటే తమ అంచనాలు తమకు ఉన్నాయనే ధీమాతో ఉన్నారు కమల నాథులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు ఓటింగ్ షేర్ తమవైపు అనూహ్యంగా పెరిగిందని అంచనాలు వేసుకుంటున్నారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 4 డివిజన్లే గెలిచామని.. కానీ ఇప్పుడు మాత్రం 30 నుంచి 50 స్థానాలను అలవోకగా గెలిచి గ్రేటర్లో తమ సత్తా చాటుతామంటున్నారు. హిందూత్వ ఓట్లు.. బస్తీ వాసుల ఓట్లు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు.. యువత ఓట్లు అన్నీ కూడా తమ ఖాతాలోనే పడ్డాయని కమల నాథులు భావిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడంలో తాము విజయం సాధించామని గెలుపైపై బీజేపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కిషన్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ మెజార్టీ డివిజన్లను కైవసం చేసుకుంటుందనే అంచనాలు వేసుకుంటున్నారు.
Must Read ;- మలక్‌పేటలో మొదలైన పోలింగ్.. మధ్యవేలుకి పెడుతున్న సిరా గుర్తు
పతంగి హవా కొనసాగేనా?..
ఓల్డ్ సిటీలో కొన్నేళ్లుగా పతంగి హవా కొనసాగుతోంది. అయితే ఈ సారి వాళ్ల కోటలకు బీటలు తప్పవని బీజేపీనేతలు అంటున్నారు. పాతబస్తీలో ఈసారి 5 నుంచి 10 సీట్లలో బీజేపీ హవా కొనసాగుతుందని కమల నాథులు పేర్కొంటున్నారు. పాతబస్తీలో టీఆర్ఎస్.. ఎంఐఎం మధ్య ఫ్రెండ్లీ ఫైటింగ్ అంశం తమకే కలిసి వస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఎప్పటిలాగే ఓల్డ్ సిటీలో పాగా వేస్తామని.. ఈసారి కచ్చితంగా 40 సీట్లకు తగ్గకుండా పాతబస్తీలో పతంగి ఎగరడం ఖాయమంటున్నారు ఎంఐఎం నేతలు.
కాంగ్రెస్ హస్తం పవరెంత?
దుబ్బాక ఎన్నికలతో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. తమ ఓటు బ్యాంకు భద్రంగా ఉందని.. అదే తమకు 10 నుంచి 15 లోపు సీట్లను కట్టబెడుతుందని కాంగ్రెస్ నేతలు ముందు నుంచి లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు బాగా కలిసి వస్తుందనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
సైకిల్ స్పీడ్ పెరిగేనా?..
ఈ ఎన్నికల్లో టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేసింది. గ్రేటర్లో తమ క్యాడర్ ఇంకా తమవైపే ఉందని, ఆంధ్రా సెటిలర్ ఓట్లు తమ ఖాతాలోనే పడతాయని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఇవ్వడమే కాదు. స్థానాలను కూడా కైవసం చేసుకుంటామని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
సత్తా చాటుతామంటున్న కోదండరామ్..
అలాగే సీపీఐ 17 చోట్ల.. సీపీఎం 12 చోట్ల పోటీ చేస్తే.. టీజేఎస్ పార్టీ 26 చోట్ల బరిలోకి దిగింది. పోటీ చేసిన అన్ని చోట్ల ప్రత్యర్థులకు తాము గట్టి పోటీ ఇస్తామనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుపై ఎవరి లెక్కలు.. అంచనాలు వారికున్నా.. గ్రేటర్ పీఠాన్ని ఓటరు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఆగాల్సిందే.
Also Read ;- పాలకుల ఎన్నికపై అంత నిర్లిప్తతా.. బయటకు రాని హైదారాబాద్ ఓటరు











