గ్రేటర్ హైదరాబాద్‌లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ రానున్న రోజుల్లో మరింత పగడ్బందీగా ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చిన ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని వేగంగా విస్తరింపచేసేందుకు నాయకులు రెడీ అవుతున్నారు . అమిత్ షా ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. గ్రేటర్‌లో మేయర్ పీఠంతో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేయబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో మూడోవంతు జనాభా ఉండే హైదరాబాద్‌లో పాగా వేస్తే ఇక రాష్ట్రంలో సులువుగా విస్తరించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలో మరో రాష్ట్రంలో తన ప్రాబల్యాన్ని చాటే పనిలో బీజేపీ నిమగ్నమైంది.
టీఆర్ఎస్‌లో తిరుగుబాటుపై విస్తృత ప్రచారం..
తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించ బోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు తగ్గట్టుగా ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. గ్రేటర్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌లో ముసలం పుట్టడం ఖాయం అంటూ ప్రకటనలు చేస్తోంది. గ్రేటర్‌లో ఓడిపోతే ఆ నిందను ఎవరిపై వేయాలన్న దానిపై నేతల మధ్య పోరు ఖాయమంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ తీరుపై ఆ పార్టీ నేతలు ,ఎమ్మెల్యేలు, మంత్రులు అసహనంతో ఉన్నారని.. వారు ఎప్పడైనా తిరుగుబాటు చేస్తారని, ఇక పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతలను డైలమాలో పడేలా చేస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ పార్టీ నేతలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారని.. అది రానురాను తిరుగుబాటుగా మారే అవకాశాలున్నాయంటున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పతనం ఖాయం అంటున్నారు.
మైండ్ గేమ్‌లో భాగంగానే..
ఓ వైపు ప్రభుత్వ పతనం ఖాయం అంటూనే మరో వైపు పార్టీ విస్తరణకు ప్లాన్ చేస్తోంది. ఏ క్షణంలో అయినా కూలిపోయే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తామే ఉండాలన్న భావనలో ఉన్న బీజేపీ గ్రేటర్ హడావుడి ముగిసిన వెంటనే జిల్లాల్లో తమ పని తామ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధ్యక్షుడు చెప్పిన విధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ బలోపేతంలో భాగంగా క్షేత్ర స్థాయిలో టీర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఇదే పనిలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా బీజేపీ మైండ్ గేమ్‌లో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తే టీఆర్ఎస్ ఎలా అడ్డకట్ట వేస్తుందో వేచి చూడాలి.











