కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్వరలోనే మంత్రి పదవి ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది. నిన్న కరీంనగర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు కవిత. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు..‘కవితకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం’లో ఉందని ప్రస్తావించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘కొత్త సంవత్సరమా..సంక్రాంతి పండుగా.. ఉగాది పండుగా’ అని ప్రశ్నించారు..అయితే మళ్లీ మీడియా ప్రతినిధులు ‘సంక్రాంతికి మీరు మంత్రివర్గంలో చేరతారా’ అనే అర్థం వచ్చేలా మరో ప్రశ్న వేశారు. ప్రతిగా స్పందించిన కవిత.. ‘ఉగాది వరకు ఆగాలా’ అన్నారు. ఈ చర్చ అంతా ఇష్టాగోష్టిగానే.. ఆఫ్ ది రికార్డుగానే జరిగింది. ఇది సరదాగా జరిగిన సంభాషణే. కాని మంత్రి పదవి వచ్చే అవకాశం లేకుంటే..కవిత మరో రకంగా స్పందించే వారని, అలాంటి చర్చే లేదని వ్యాఖ్యానించేవారు.. ఖండించేవారు ఉన్నారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకుల నుంచి వచ్చే స్పందనే. కాని కవిత అందుకు భిన్నంగా వ్యాఖ్యానించడంతో.. సంక్రాంతికి కావచ్చు.. ఉగాదికి కావచ్చు.. మంత్రి వర్గంలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఫలితాల తరువాత..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్‌లో 2014 -2019 కాలంలో ఎంపీగా ఉన్న కవిత.. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి కవితకు ఏదో ఒక పదవి కచ్చితంగా ఇస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో కవిత ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో కవితకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం మొదలైంది. ఇక తాజాగా కవిత వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ ప్రచారానికి బలం చేకూరేలా ఉంది.
Also Read ;- ‘మన్ కీ బాత్’ ని రైతు బాట పట్టించిన మోడీ
కవితతో కలిపితే నాలుగు..
కేసీఆర్ కుటుంబ పాలన అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలాంటి కామెంట్లు చేసినా.. ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం గట్టారు. దీంతో ఆ విమర్శలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం టీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇక కేసీఆర్ కుటుంబ విషయానికి వస్తే.. కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన కుటుంబంలోనే కేటీఆర్, హరీష్‌లు మంత్రులుగా ఉన్నారు. తాజాగా కవితకు మంత్రి పదవి ఇస్తే.. ఆ కుటుంబంలోనే నాలుగు పదవులు అవుతాయి. ఒక వేళ ఇప్పటికే ఉన్న పదవుల విషయం చూసినా.. జోగినపల్లి సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే కేసీఆర్ కుటుంబం లేదా సమీప బంధువులే మొత్తం ఆరు పదవుల్లో ఉన్న నేపథ్యంలో కవితకు మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది.
కేసీఆర్ సంకేతం అదేనా..
ఇక కేసీఆర్ డిసెంబరు నుంచి మోడీపై పోరాటమే లక్ష్యమని గతంలో ప్రకటించారు. రానున్న కాలంలో ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళ్తారన్న అంచనాలున్నాయి. అది ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే…కేటీఆర్ సీఎం అవుతారని కూడా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కవితకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తప్పని పరిస్థితి అయితే తప్ప.. ఇప్పుడున్న వారిని కొనసాగిస్తూనే కవితను మంత్రిని చేసే అవకాశం తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.
Must Read ;- ఇటువంటి వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో చోటులేదు:కేటీఆర్