రవి ప్రకాశ్..ఈ పేరుకంటేTVనైన్ రవి ప్రకాశ్ అంటేనే అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు వెనుక వ్యూహకర్తగా ఆయన ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ లేవనెత్తాల్సిన అంశాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రసంగాల్లో టచ్ చేయాల్సిన కీ పాయింట్లను రవి ప్రకాశ్ అండ్ కో సూచించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇటీవల పలువురు నాయకులు బీజేపీలో చేరే విషయంలోనూ రవి ప్రకాశ్ కీలకంగా మారారని, అయితే, ఇదంతా ఆఫ్ స్క్రీన్‌గా జరుగుతోందని చెబుతున్నారు. ఇందుకు కారణాలూ ఉన్నాయి.
టీవీ వివాదం తరువాత..
న్యూస్ ఛానెళ్లలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన వ్యక్తిగా రవి ప్రకాశ్‌కి పేరుంది. అది సమాజానికి ఎంత మేలు చేసింది, ఎంత కీడు చేసింది అనే విషయం పక్కన పెడితే.. ఆ టీవీ మాత్రం జనాల్లోకి వెళ్లింది. అంతకు ముందు టీడీపీ హయాంలో బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో తేజ న్యూస్ (తరువాత ఆ ఛానెల్ జెమిని న్యూస్‌లో విలీనమైంది) లైవ్ కవరేజీతో రవి ప్రకాశ్ పేరు మారు మోగింది. తరువాత TV9 ఏర్పాటైంది. ఇక వాటాదార్ల మధ్య వివాదం, యాజమాన్యం చేతుల మార్పు.. మోజో టీవీ ఏర్పాటు, ఆర్ ఫ్యాక్టరీ ..ఇలా పలు వివాదాలు చుట్టు ముట్టాయి. కొన్ని అంశాల్లో కేసులూ నమోదయ్యాయి. ఆయన అరెస్టయ్యారు కూడా. ఇదంతా ఓ పార్టీ, ఇద్దరు పారిశ్రామిక వేత్తల కుట్రగా భావిస్తున్న రవి ప్రకాశ్ రకరకాల అవకాశాలను పరిశీలించారు. తన పాత సంస్థ విస్తరణకు వీలైనన్ని అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తూనే.. తన వ్యూహంతో ఇతర రాష్ట్రాల్లో ఛానెళ్లను తమవైపు తిప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
తొలుత తమిళనాడు, కర్ణాటకల్లో కొన్ని టీవీలను కాషాయమయం చేశాక.. ఆయన రాజ్ న్యూస్ (తెలుగు) లో చేరారు. ఆ ఛానెల్ కొంత కాలం పాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కి సంబంధించిన వారి నిర్వహణలో ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఇబ్బంది కావడంతో వారు తమ వాటాల్లో కొన్ని అమ్మేందుకు సిద్ధం అయ్యారట. అదే టైంలో తెలంగాణేతరుడైన ఓ బీజేపీ లీడర్ వీరి వాటాలతో పాటు ఇతర వాటాలను కొన్నారు. మొత్తం మీద సింహభాగం వాటాలు ఆయనకే దక్కాయి.అయినా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం పట్టు ఇంకా కొనసాగుతోంది. ఈ కార్యకలాపాల్లో రవి ప్రకాశ్ కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. రవి ప్రకాశ్ రాజ్ న్యూస్‌లోకి వెళ్లాక ఆ ఛానెల్ యాంటీ టీఆర్ఎస్, యాంటీ మైం హోం గ్రూప్‌గా మారింది. లీగల్‌గా సమస్యలు తలెత్తుతున్నా.. దూకుడు మాత్రం తగ్గడం లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆర్ ఫ్యాక్టరీ టీం వర్క్ చేసినట్టు చెబుతున్నారు. అదే టైంలో బీజేపీలో చేరికను ప్రోత్సహించడం, ఎవరెవరికి గాలం వేస్తే.. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందనే వ్యూహం రచించడం కూడా జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేశారన్న చర్చ కూడా నడుస్తోంది.
అప్పుడు లక్ష్మణ్..
గతంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించిన సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి తానే సీఎం అభ్యర్థినని అని మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్‌లు బయటకు రావడం కూడా బీజేపీలో చర్చనీయాంశమైంది. రాజగోపాల్ రెడ్డి రాకను బీజేపీలో అడ్డుకునే యత్నం జరిగిందని కూడా అప్పట్లో చర్చ నడిచింది. ఇప్పుడు రవి ప్రకాశ్, బండి సంజయ్, అదే పార్టీకి చెందిన హైదరాబాద్‌కి చెందిన కీలక నేత ఒకరు సర్దుబాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతారా, రవి ప్రకాశ్ వ్యూహం నిజమేనా అనేది తేలాల్సి ఉంది.