కరువు ప్రాంతం రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్న వాదనలు ఎలా ఉన్నా… ఆ అన్యాయానికి ఇటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు అటు తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కూడా కారణమేనని బీజేపీ కీలక నేత విష్ణువర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ దుర్భిక్షాన్ని నివారించే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ… కృష్ణా నదిపై తన భూభాగంలో మరో కొత్త ప్రాజెక్టు చేపట్టాలని తీర్మానించిన తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సర్కారు చర్యలు చేపడుతుంటే… నీటి చౌర్యమంటూ తెలంగాణ సర్కారు తీవ్ర ఆరోపణలు చేయడం తగదని కూడా ఆయన సూచించారు.
తెలంగాణ కేబినెట్ చర్చపై స్పందనేది?
ఇక రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి ఒక్క తెలంగాణ మాత్రమే కారణం కాదని… ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా కారణమేనని విష్ణువర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది ఎగువ భాగంలో పై తన పరిదిలో తెలంగాణ కొత్తగా ప్రాజెక్టు కడితే అప్పుడు రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు కట్టేందుకు తెలంగాణ కేబినెట్ లో కీలక చర్చ జరిపితే… దానిపై వేగంగా స్పందించాల్సిన జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఏ ప్రాంతం అన్యాయానికి గురైనా జగన్ సర్కారు పెద్దగా పట్టించుకోని వైఖరికి ఈ ఘటన నిదర్శనమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేబినెట్ చర్చపై రాయలసీమకే చెందిన జగన్ ఇప్పటిదాకా స్పందించకపోవడానికి గల కారణాలేమిటని కూడా ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్, జగన్‌లకు స్వప్రయోజనాలే ముఖ్యం
రాయలసీమకు అన్యాయం చేసేలా కేసీఆర్ కీలక చర్చలు చేస్తుండటం, ఇటు జగన్ ప్రేక్షకపాత్ర వహిస్తున్న వైనం వెనుక పెద్ద మతలబే ఉందని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ వారి వారి రాష్ట్రాల కోసం ఏ తరహా ఆలోచనలు చేస్తున్నా… వారిద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలకు వారి రాష్ట్రాల ప్రయోజనాల కంటే కూడా వారి స్వప్రయోజనాలే మొఖ్యమైపోయాయని కూడా ఆయన ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం జరిగేలా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాయలసీమయకు చెందిన వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Must Read ; కేసీఆర్ కామెంట్!.. వైఎస్సార్ ను మించిన మూర్ఖుడు జగన్











