ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. చీకటి పడుతున్న వేళ కాబోయే భర్తతో కృష్ణా నదీ తీరానికి వెళ్లిన ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున బాధితురాలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో చోటుచేసుకున్న ఈ ఘటన క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది. సీఎం నివాసం ఉండే తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు… నిందితుల కోసం విజయవాడను జల్లెడ పడుతున్నారు.
కాబోయే భర్తతో కలిసి తీరానికి..
ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే… బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతికి ఇటీవలే నాని అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో కాబోయే భర్యాభర్తలు… శనివారం సాయంత్రం అలా కృష్ణా తీరం వెంట షికారుకెళదామని బయలుదేరారు. తాడేపల్లికి సమీపంలోని సీతానగరం పుష్కర ఘాట్ కు వచ్చిన వారిద్దరూ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నానిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి బారి నుంచి వీరు ఎలా బయటపడ్డారో తెలియదు గానీ… ఆదివారం తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
తాడేపల్లిలో ఘటనతో పోలీసుల హైఅలర్ట్
జగన్ క్యాంపు కార్యాలయం ఉండే తాడేపల్లి పరిదిలో గ్యాంగ్ రేప్ జరిగిందన్న వార్తలు దావానలంలా వ్యాపించాయి. న్యూస్ ఛానెళ్లు ఈ వార్తను పదే పదే ప్రసారం చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసు బాసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు ప్రస్తుతం విజయవాడలోని పలు కీలక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. విజయవాడలోని కృష్ణా తీరం వెంట గంజాయి సేవించే వారు, బ్లేడ్ బ్యాచ్ లు నిత్యం సంచరిస్తూ ఉంటాయన్న వార్తలతో ఆ కోవకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు.
కాబోయే భర్తపైనా అనుమానాలు?
ఇదిలా ఉంటే… యువతిపై గ్యాంగ్ రేప్ జరగడం, ఆమె పక్కనే ఉన్న ఆమె కాబోయే భర్త నానికి ఎలాంటి గాయాలు కాని నేపథ్యంలో పోలీసులు నానిని కూడా అనుమానిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితులతో పాటు నానిని కూడా స్టేషన్ కు తరలించి విచారిస్తున్నట్లుగా సమాచారం. అసలు గ్యాంగ్ రేప్ నకు దారి తీసిన పరిస్థితులు.. కాబోయే భార్యపై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నావంటూ పోలీసులు నానిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం జగన్ క్యాం.పు కార్యాలయం ఉన్న తాడేపల్లి పరిధిలో ఘటన జరగడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Must Read ;- రఘురామ ఫిర్యాదుపై కదిలిన లోక్ సభ జగన్ కు కష్టాలేనా?










