బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగుతారని భావించిన ఆ పార్టీ యువ కిశోరం విష్ణు వర్ధన్ రెడ్డి ఇప్పుడు కొడిగట్టిన దీపంలా మారిపోయారు. అప్పుడెప్పుడో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను పదే పదే గుర్తు చేసుకుంటున్న ఆయన తెగ ఇదైపోతున్నారట. ఈ రెడ్డి గారిని ఎవరు టార్గెట్ చేసినా. ఆ అవినీతి వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ ఉండటంతో.. ఇలాగైతే కాదనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. నేరుగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి వెళ్లిన ఆయన అక్కడ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సత్యప్రమాణం చేశారు. ప్రొద్దటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యత్నించగా.. దానిని అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన విష్ణు వైసీపీకి టార్గెట్ అయిపోయారు. అవినీతికి కాస్తంత దూరంగా ఉంటారని భావిస్తున్న రాచమల్లు.. తనపైకి వచ్చిన విష్ణుపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో విష్ణు సత్య ప్రమాణానికి పూనుకున్నారు.
రాచమల్లు వర్సెస్ విష్ణు
కడప జిల్లా ప్రొద్దటూరులో వ్యాపార వర్గాలు బాగా ఉంటాయి. సినిమా ఫైనాన్స్ కూడా ఇక్కడి నుంచి బాగానే వస్తుందట. ఈ క్రమంలో పట్టణంలోని ఓ వర్గం తమ వీధిలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఆశ్రయించింది. ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానంటూ రాచమల్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ విషయం తెలిసినంతనే బీజేపీ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దేవ్ ధర్ సహా బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రొద్దటూరులో వాలిపోయారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ నిరసనలకు దిగారు. సరే.. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి నివేదించిన జిల్లా కలెక్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే రాచమల్లుకు, అనంతపురం జిల్లాకు చెందిన విష్ణుకు మధ్య మాటల తూటాలు పేలాయి. విగ్రహ ప్రతిష్టాపన ఆగినా.. వీరి మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు.
మఠం నుంచి డబ్బు తీసుకున్నారట
రాయలసీమ మొత్తంగా ఎడారిగా కనిపిస్తుంది కదా. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ కొందరు స్వామీజీలు టెంట్లు వేసేస్తున్నారు. పెద్ద ఆశ్రమాలను కట్టేస్తున్నారు. కాలక్రమంలో ఆ ఆశ్రయాల వేదికగా పెద్ద కథలే నడుస్తున్నాయి. ఇలాంటి ఓ ఆశ్రమం చిత్తూరు జిల్లాలోనూ వెలసింది. ఈ ఆశ్రమానికి బీజేపీ అధిష్ఠానానికి చెందిన పెద్దలు వస్తూ పోతూ ఉంటారట. అయితే ఆ ఆశ్రమంపై గతం కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు వచ్చాయి. దీంతో భయపడిపోయిన ఆ ఆశ్రమ నిర్వాహకులు విష్ణును ఆశ్రయించారట. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మాట్లాడి తమకు కాస్త అనుకూలంగా వ్యవహరించేలా చూడాలంటూ కోరారట. అందుకోసం వారి వద్ద నుంచి విష్ణు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారట. ఈ విషయాన్ని కూడా కొన్ని పత్రికలు రాయగా.. విష్ణు అంటే గిట్టని వారంతా దానినే ఆసరాగా చేసుకుని ఆయనపై విరుచుకుపడిపోతున్నారట. అందులో భాగంగా ఇప్పుడు కూడా రాచమల్లు ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని విష్ణుపై దాడికి దిగగా.. తన సత్య శీలతను నిరూపించుకునే క్రమంలోనే విష్ణు కాణిపాకంలో సత్య ప్రమాణం చేశారట.











