ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలగిన వైసీపీ కార్యకర్త సునిల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే దిశగా విచారిస్తోంది. కోర్టు అనుమతితో అనిల్ ను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సీబీఐ.. వివేకా హత్యకు వినియోగించిన ఆయుధాల వెలికితీతను కొనసాగిస్తోంది. మంగళవారం నాడు సీబీఐ అధికారులు ఓ కీలక అడుగు వేశారు. జగన్ దాయాదీ, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఇద్దరిని విచారణకు రప్పించింది. అంతేకాకుండా అవినాశ్ రెడ్డికి చెందిన పలువురు అనుచరులను కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏలను విచారణకు పిలిచిన వైనం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది.
ఘటనా స్థలిలో అవినాశ్ రెడ్డి
వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో అక్కడ అందరికంటే ముందు కనిపించిన వైఎస్ అవినాశ్ రెడ్డిపై నాడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. కడప ఎంపీగా వైఎస్ వివేకానందరెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న జగన్ కోసం వివేకా ఆ కడప ఎంపీ సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కుటుంబంతో దూరంగా జరిగిన వివేకా.. జగన్ అరెస్ట్ సందర్భంగా తిరిగి ఆ ఫ్యామిలీతో కలిసిపోయారు. ఈ క్రమంలో వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన వివేకా.. 2019 ఎన్నికల సన్నద్ధతలోనూ చురుగ్గా వ్యవహరించారు. ఈ క్రమంలో జగన్ కడప ఎంపీ సీటును వదిలేసి పులివెందుల అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కడప ఎంపీ సీటు తనకే దక్కుతుందని కూడా వివేకా అనుకున్నారు. అయితే ఆ సమయంలో కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధపడిపోయిన వైఎస్ అవినాశ్ రెడ్డి.. తనకు అడ్డుగా ఉన్న వివేకాను తొలగించుకునే యత్నాలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే వివేకా హత్యకు గురి కావడంతో అందరి దృష్టి అవినాశ్ రెడ్డిపైనే పడింది.
అనిల్ చెప్పిన మేరకేనా..?
ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసుపై విచారణ చేపట్టిన రెండు సిట్ బృందాలు గానీ. ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేసిన సీబీఐ గానీ అవినాశ్ అనుచరులను విచారణకు పిలిచిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే మంగళవారం నాడు మాత్రం అవినాశ్ వద్ద పీఏలుగా పనిచేస్తున్న రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, మరో వ్యక్తి బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్ లో ఉన్న సీఐ శంకరయ్యలను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో తొలుత అక్కడికి అవినాశ్ రెడ్డే వచ్చారని, అవినాశ్ రెడ్డి చెప్పిన మేరకే వివేకా మరణాన్ని హత్యగా కాకుండా గుండెపోటుగా సీఐ శంకరయ్య నమోదు చేశారన్న వాదనలు వినిపించాయి. అంతేకాకుండా సీబీఐ కస్టడీలో ఉన్న సునిల్ చెప్పిన మేరకే వీరిని విచారణకు పిలిచారా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి పీఏలు, సీఐ శంకరయ్యలను సీబీఐ అధికారులు విచారణకు పిలవగానే.. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వివేకా కేసులో అన్ని వేళ్లూ జగన్ వైపే!











