దుబ్బాక ఉప ఎన్నికల తరువాత నిర్వహించిన బీజేపీ కీలక సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మరో వైపు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పోరుపై సర్వత్రా ప్రసంశలు అందుతున్న నేపథ్యంలో పార్టీ గెలుపు అవకాశాలపైనా పదాధికారులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు , కార్యకర్తలు టార్గెట్‌గా లాఠీ ఛార్జీలు చేయడం, అక్రమ కేసులు బనాయిస్తోందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని , కేసులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ , జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ…
రాష్ట్రంలో తమకు అనుకూల పవనాలు ప్రారంభమయ్యాయని బీజేపీ భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు , రైతులు సైతం బీజేపీకి జై కొట్టారన్న వార్తల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై పదాధికారులు చర్చించారు. ముఖ్యంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లను తమవైపు ఎలా తిప్పుకోవాలన్న దానిపై ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వానికి వివరించారు. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ యువత బీజేపీ వైపే ఉన్నారని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలగా మార్చుకుంటే గెలుపు అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గ్రాడ్యుయేట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చక పోవడంతో ప్రభుత్వంపై వారు గుర్రుగా ఉన్నారని , దీన్నిమరింత విస్తృతంగా ప్రచారం చేయగలితే చాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక నాయకులకు ఇచ్చిన ఎన్రోల్‌మెంట్ టార్గెట్‌ను ఏ మేరకు రీచ్ అయ్యారు, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటన్నది చర్చకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ , ఎంఐఎంను ఎలా ఎదుర్కోవాలి, మేయర్ పీఠం సాధించాలంటే ఆ రెండు పార్టీలను ఎలా దెబ్బ కొట్టాలన్న దానిపైనా రాష్ట్ర నాయకులు చర్చించారు. గ్రేటర్‌లో వరదల కారణంగా ప్రస్తుతం ప్రజలంతా అధికార టీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వరదల సమయంలో పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో చేసిన సేవలకు ప్రశంసలు కురిపిస్తున్నారని నాయకులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో కొంత కష్టపడంతో పాటు బలమైన నాయకులను పోటీలో దింపాలని నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలి..
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నం చేసిన కార్యకర్త చికిత్స పొందుతూ చని పోవడం రాష్ట్ర నాయకత్వాన్ని కలిచి వేసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కార్యకర్త అంతిమ యాత్రకు రాష్ట్ర నాయకత్వం కదిలి వెళ్ళింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ప్రతి ఒక్క నేత రాష్ట్రంలో ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు తమ వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా కార్యకర్తల్లో మనో ధైర్యం నింపాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్న ధైర్యం వారికివ్వాలని సంజయ్ సమావేశంలో అభిప్రాయ పడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దన్న సందేశాన్ని బలంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్ళాలంటూ సూచించారు.











